విద్యుత్ రంగంలో సంస్కరణల అమలకు సంబంధించిన రుణాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు అదనంగా 0.5శాతం రుణాలు పొందేందుకు వెసులుబాటు ఇచ్చింది. విద్యుత్ సంస్కరణల్లో ప్రధానంగా మూడు అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకుగాను ఈ అవకాశం కల్పించింది కేంద్రం. ఈ అవకాశాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12 రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు ఆ అవకాశం దక్కింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
ఈ వెసులబాటుతో 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఏపీ సర్కారు రూ.3,716 కోట్లు రుణం తీసుకుంది. ప్రస్తుతం కల్పించిన వెసులుబాటుతో రూ.5,858 కోట్ల రుణం తీసుకునేందుకు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్, అసోం, కేరళ, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలకు అదనపు రుణాలు తీసుకోడానికి కేంద్రం అనుమతిచ్చింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా వివరాలను వెల్లడించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సిఫారసుతో రాష్ట్రాలు మార్కెట్ నుంచి అదనపు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్రమంత్రి పేర్కొన్నారు. కార్యాచరణ, ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం, చెల్లింపు విద్యుత్ వినియోగంలో నిరంతర పెరుగుదలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ రుణాలను అందజేస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. ఇక, 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 12 రాష్ట్రాలకు 38,175 కోట్ల రుణాలకు అనుమతించినట్టు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరు రాష్ట్రాలకు 27,238 కోట్ల రుణాలకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. 2021-22 నుంచి 2024-25 మధ్య కేంద్ర విద్యుత్ శాఖ మొత్తం రూ. 143,332 కోట్ల రుణాలకు సిఫార్సు చేసినట్టు పేర్కొన్నారు.