కొవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుచర్యలు చేపట్టింది. ఏలూరు జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు శుక్రవారం వందేసి చొప్పున ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను పంపిణీ చేసింది. మరో పదివేల కిట్లు రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి అందాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో వున్న హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లు ఒక్కొక్క దాంట్లో పది చొప్పున కిట్లను అందుబాటులో వుంచిన వైద్య ఆరోగ్యశాఖ వీటి వినియోగం పైనా మార్గదర్శకాలను శుక్రవారం పంపింది. తీవ్ర తలనొప్పి, దగ్గు, జలుబు, జ్వరం వంటి ఇన్‌ఫ్లుయింజా లక్షణాలతో ఆస్పత్రి అవుట్ పేషెంట్ (ఓపీ) విభాగాలకు వచ్చే రోగులకు, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో వచ్చే రోగుల నుంచి శ్వాబ్‌లను సేకరించి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లతో కరోనా టెస్టులు చేయాలని ఆదేశించింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ నిర్ధారణ అయిన రోగుల శాంపిల్‌ను కొవిడ్ వేరియంట్ తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది. తీవ్రత బట్టి శాంపిల్‌ను ఆర్టీపీసీఆర్ టెస్టులకు పంపాలని అధికారులు కోరారు. అన్ని ఆస్పత్రుల్లోను గతంలో మాదిరిగానే కొవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించాలని కోరింది. ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గతంలో వున్న వీఆర్‌డీఎల్ ల్యాబ్‌ను తిరిగి తెరిచేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆశ్రం ఆస్పత్రిలో కొవిడ్ టెస్టులను చేసేందుకు వీలుగా ప్రైవేటు ల్యాబ్‌ను యాజమాన్యం ప్రారంభించినట్టు డీఎంహెచ్‌వో కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆశ్రం ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విది తమే. ప్రస్తుతం ఆ వైద్యుడి ఆరోగ్యస్థితి నిలకడగానే ఉందని, సేకరించిన శ్వాబ్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్టు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఆయనను కలిసిన ఆరుగురు ప్రైమరీ కాంటాక్టు వ్యక్తుల నుంచి శ్వాబ్‌లను సేకరించి టెస్టులు చేశామని ఎవరికీ కొవిడ్ లక్షణాలు నిర్ధారణ కాలేదని వివరించాయి.