వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి రోజున 3 కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనం కోసం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరుతుంటారు. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శనివారం ఉదయం ఒంటి గంట 45 నిమిషాలకు తిరుమలలో ఉత్తర ద్వారం తెరుచుకుంది. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయంకు ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు.