ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. త్వరలో పట్టాలెక్కనున్న కొత్త రైళ్ల ఫీచర్లివే

national |  Suryaa Desk  | Published : Tue, Dec 26, 2023, 10:28 PM

భారతీయ రైల్వే సామాన్యుల కోసం మరో సరి కొత్త రైలును అందుబాటులోకి తీసుకొస్తోంది. సామాన్యుల కోసం తీసుకొస్తున్న ఈ రైలును ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ అని పిలుస్తున్నారు. ప్రధానంగా నాన్ ఏసీ రైళ్లలో ప్రయాణించే సామాన్యులను దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను తీర్చిదిద్దారు. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న అయోధ్య వేదికగా తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో ఏరో డైనమిక్ డిజైన్‌తో తయారైన బోగీలు అమృత్ భారత్ రైళ్లలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరాలకు ప్రయాణ సేవలు అందించాలనేది అమృత్ భారత్ రైళ్ల లక్ష్యం. ఈ రైళ్ల ప్రత్యేకతలు, ఫీచర్లు ఇవే..


​అత్యాధునిక కోచ్‌లు, 12 స్లీపర్ బోగీలు


అమృత్ భారత్ మొత్తం 22 ఎల్ హెచ్ బీ బోగీలు ఉంటాయి. వీటిలో 12 స్లీపర్, 8 జనరల్, 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. వాటిలోనే మహిళలు, దివ్యాంగులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రైళ్ల కోసం ఉపయోగించే ఇంజిన్లను పశ్చిమ బెంగాల్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో తయారు చేస్తున్నారు. ఒక్కో ఇంజిన్ సామర్థ్యం 6000 హెచ్ పీ


​బోగీల్లో తొలిసారిగా రేడియం ఇల్యుమినేషన్


‘రేడియం ఇల్యుమినేషన్’ అమృత్ భారత్ రైలు బోగీల మరో ప్రత్యేకత. రాత్రి వేళల్లో లైట్లు ఆర్పివేసి ఉన్న సమయాల్లో ప్రయాణికులకు ఈ టెక్నాలజీ సహాయకంగా ఉంటుంది. ఇండియన్ రైల్వే ఈ సాంకేతికతను రైలు బోగీల్లో తొలిసారిగా ప్రవేశపెడుతోంది.


​పుష్-పుల్ ఇంజిన్లు


పుష్-పుల్ ఇంజిన్లు ఈ అమృత్ భారత్ రైళ్ల మరో ప్రత్యేకత. అంటే, రైలు ముందూ వెనుక ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ బోగీలను లాగితే, మరొకటి నెట్టుతుంది. ఫలితంగా రైలు ఒడుపులు లేకుండా ప్రయాణిస్తుంది. ముఖ్యంగా వంపు మార్గాలు, వంతెనల పైనుంచి ప్రయాణించే సమయంలో పుష్ - పుల్ ఇంజిన్ల కారణంగా వేగాన్ని నియంత్రించడం మరింత సులభం అవుతుందని ఇంజినీర్లు తెలిపారు. జర్నీ స్మూత్‌గా ఉండటమే కాకుండా, ఈ ఫీచర్ వల్ల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుందని వివరించారు.


​ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్


అమృత్ భారత్ రైలు బోగీల్లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటు దగ్గర మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లు ఉంటాయి. అత్యవసర వేళల్లో సమాచారాన్ని అందించేందుకు ఎల్‌ఈడీ డిస్‌ప్లే వ్యవస్థ ఉంటుంది. సౌకర్యవంతంగా సీట్లు, ఎల్ఇడీ లైట్లు, ఆధునిక డిజైన్లలో ఫ్యాన్లు, స్విచ్‌లు ఏర్పాటు చేశారు.


​అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం ఎంత?


అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను గంటకు గరిష్టంగా 130 కి.మీ. వేగంతో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చారు. అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ రైళ్లకు ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ రైళ్లలో ఏసీ, నాన్-ఏసీ బోగీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆయా మార్గాల్లో డిమాండ్‌ను బట్టి వీటిని ప్రవేశపెడతారు.


​అత్యాధునిక టాయిలెట్లు


ఈ రైళ్లలో అత్యాధునిక బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్లను ఏర్పాటు చేశారు. వీటికి సెన్సార్ ట్యాప్స్ ఉంటాయి. ఈ రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణించొచ్చు. 800 కి.మీ. పైగా దూరం ఉన్న నగరాల మధ్య ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. అంత్యోదయ, జన్‌ సాధారణ్, సూపర్‌ఫాస్ట్ ట్రైన్ల స్థానంలో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టనున్నారు.


​ఒక్కో రైలు తయారీకి ఖర్చు ఎంత?


దేశంలోని రైళ్లన్నింటినీ ఆధునికీకరించాలనే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నెలకు 20 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో రైలు తయారీకి రూ. 65 కోట్లు ఖర్చు అవుతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మాదిరిగా వైఫై సేవలు, ఆటోమేటిక్ డోర్స్, కదిలే సీట్లు, ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ లాంటి సదుపాయాలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండవు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa