గ్రామ, వార్డు వలంటీర్లకు ప్రతి నెలా గౌరవ వేతనంగా చెల్లిస్తున్న రూ.5,000కు అదనంగా మరో రూ.750ను ప్రోత్సాహకంగా చెల్లించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లు క్రియాశీలకంగా పాల్గొంటున్నందుకు ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్టు తెలిపింది. ప్రతి నెలా రూ.750 మొత్తాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా వేరేగా వలంటీర్లకు అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్ టీఎస్ చేతన్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లు, జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఇన్‌చార్జిలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్‌డీవోలు, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఇంటింటికీ రేషన్ పంపిణీలో వలంటీర్లను మరింత భాగస్వాములను చేయనున్నారు. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ వలంటీర్లకు కొన్ని ప్రత్యేక విధులను నిర్ధారించింది. వీటిని కూడా రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు తెలియజేశారు. కాగా వలంటీర్లకు రూ.750 అదనపు ప్రోత్సాహకాన్ని ఎప్పటి నుంచో వర్తింపజేస్తామో వేరేగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది.