రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యుత్ సంస్థలకు అందించే ‘ఫాల్కన్ మీడియా–ఎనర్షియా ఫౌండేషన్’ జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి. ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ ట్రాన్స్‌కో)కు ‘టాప్ స్టేట్ యుటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ అవార్డు లభించింది. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌ల ప్రచారానికి సంబంధించి దేశంలోనే బెస్ట్ స్టేట్ టాప్ రెన్యూవబుల్ ఎనర్జీ నోడల్ ఏజెన్సీగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ) అవార్డును కైవసం చేసుకుంది. రెన్యూవబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్స్ (పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత) లక్ష్యాన్ని చేరుకోవడంలోనూ ముందంజలో ఉన్న ఉత్తమ రాష్ట్రంగా ఏపీ విద్యుత్ సంస్థలను అవార్డు వరించింది. డిసెంబర్ 29వ తేదీన ముంబైలో జరిగిన ‘16వ ఎనర్షియా అవార్డ్స్–2023’ ప్రదానోత్సవంలో ఏపీ విద్యుత్ సంస్థలకు ఈ అవార్డులను అందించారు. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి రాష్ట్రానికి లభించిన అవార్డుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకోవడంలో కృషి చేసిన విద్యుత్ సంస్థలు, ఇంధన శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా అభినందించారు.