ఢిల్లీ మద్యం కేసులో విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మూడోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులను పట్టించుకోని కేజ్రీవాల్.. తాను విచారణకు హజరు కావడం లేదంటూ ఈడీకి తిరిగి లేఖ రాసినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే రెండు సార్లు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేసిన అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా తిరస్కరించడంతో మూడోసారి అయింది. దీంతో ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదా అనే వాదన తెరపైకి వచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ తమ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈడీ విచారణకు కేజ్రీవాల్ హాజరు కావడం లేదని పేర్కొన్నారు. అయితే విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఈడీకి కేజ్రీవాల్ లేఖ కూడా రాశారని ఆప్ తెలిపింది. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడమే కేంద్రం ఏకైక లక్ష్యమని ఆప్ మండిపడింది.
ఢిల్లీ మద్యం కేసు విచారణలో భాగంగా ఈడీ దర్యాప్తుకు సహకరించడానికి కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఇప్పుడు నోటీసులు ఎందుకు పంపించారని ఆప్ ప్రశ్నించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అరవింద్ కేజ్రీవాల్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈడీ నోటీసులు పంపించిందని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈ నోటీసులు పంపించారని ఆప్ ఆరోపించింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని గతేడాది నవంబర్ 2, డిసెంబరు 21 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈ విచారణలకు ఆయన హాజరు కాలేదు. 2 సార్లు ఈడీ అధికారులు నోటీసుల ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరు అయ్యారు. తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసినా ఆయన హాజరు కావడం లేదని పేర్కొన్నారు. అయితే ఈడీ నోటీసులు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. వాటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు.
ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు విచారణ జరిపారు. గత ఏడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు సీబీఐ ప్రశ్నించించింది. ఆ తర్వాత కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక ఇదే కేసులో గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను ఈడీ అరెస్ట్ చేసింది. మరో ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ను కూడా అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఇక మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కేజ్రీవాల్ గైర్హాజరు కావడంతో ఆయనపై ఈడీ నాన్ బెయిలబుల్ వారెంట్ కోరి.. కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ పాటించడంలో విఫలమైతే అరెస్టు చేసి తదుపరి కోర్టు విచారణకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.