ఎటువంటి ఆధారాల్లేకుండా భర్తకు వేరే మహిళలతో సంబంధాలు అంటగట్టడం, స్త్రీలోలుడని ఆరోపణలు చేయడం అత్యంత క్రూరత్వమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఆ కారణంతో వివాహాన్ని రద్దు చేయడం సరైందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్దించింది. తనపట్ల భార్య క్రూరంగా వ్యవహరిస్తోంద పేర్కొంటూ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై కుటుంబ న్యాయస్థానం విచారణ జరిపి.. అతడికి అనుకూలంగా తీర్పు చెప్పింది.
దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ ధర్మాసనం.. భార్యాభర్తల బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా విజయవంతమైన వైవాహిక బంధం పరస్పర గౌరవం, విశ్వాసం ఆధారంగా నిర్మితమవుతుందని, ఒక స్థాయికి మించి రాజీపడితే, బంధానికి ముగింపు అనివార్యమని పేర్కొంది. ‘దురదృష్టవశాత్తూ తన ఆఫీసు మీటింగ్‌ల సమయంలోను సిబ్బంది లేదా ఇతరుల ముందు నిరాధారమైన ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లిన తన భార్య బహిరంగంగా వేధించడం, అవమానించడం, మాటలతో దాడి చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి.. ఆమె తన కార్యాలయంలోని మహిళా ఉద్యోగులను కూడా వేధించడం ప్రారంభించింది.. అతన్ని స్త్రీలోలుడిగా చిత్రీకరించడానికి ఎటువంటి అంశాన్ని వదిలిపెట్టలేదు. ఈ ప్రవర్తన భర్త పట్ల అత్యంత క్రూరమైన చర్య’ అని ధర్మాసనంలోని జస్టిస్ నీనా వ్యాఖ్యానించారు.
‘తన స్నేహితుడి భార్య అయిన మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ఆరోపించడం అనేది క్రూరత్వం.. బంధం అనివార్య ముగింపుకు దారి తీస్తుంది. మరొకరి జీవిత భాగస్వామికి పరువు నష్టం కలిగించే, అవమానకరమైన, నిరాధారమైన ఆరోపణలు.. వారి ప్రతిష్టను బహిరంగంగా దెబ్బతీసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.. ఇది తీవ్రమైన క్రూరత్వ చర్యలు తప్ప మరొకటి కాదు’ అని ఉద్ఘాటించారు. ‘జీవిత భాగస్వామి తనను గౌరవించాలని, అవసరమైనప్పుడు రక్షణ కవచంగా ఉండాలని భర్త కోరుకుంటాడు.. నిరంతరం తనను సాధిస్తూ, వ్యక్తిత్వాన్ని శంకిస్తుంటే అది మానసిక క్షోభకు గురిచేస్తుంది. దాంపత్యం విజయవంతం కావడమనేది పరస్పర గౌరవ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కేసులో దురదృష్టవశాత్తూ భర్తే బహిరంగంగా వేధింపులు, అవహేళనలకు గురయ్యారు. ఆఫీసులో అందరి ముందు ఆయన్ని అవమానించేలా భార్య దుర్భాషలాడింది.. ఆయనకు పర స్త్రీ వ్యామోహం ఉందని చిత్రీకరించడానికి చేయని ప్రయత్నమంటూ లేదు.. ఇది అత్యంత క్రూరత్వం..
భర్తకు వంధ్యత్వం ఉందని చేసిన ఆరోపణ సరికాదని వైద్యపరీక్షల్లో తేలింది. బిడ్డను కూడా ఆయనకు దూరం చేసి, అన్నివిధాలా భర్తను ఆమె వేదనకు గురిచేసింది’ అని ధర్మాసనం పేర్కొంటూ ఈ మేరకు విడాకులను మంజూరు చేసింది. ‘తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను దూరం చేయడం కంటే ఎక్కువ బాధాకరమైనది మరొకటి ఉండదు.. తల్లిదండ్రులు పిల్లలను ఉద్దేశపూర్వకంగా దూరం చేయడం మానసిక క్రూరత్వానికి సమానం. ప్రస్తుత సందర్భంలో కూడా కొడుకును పూర్తిగా దూరం చేయడమే కాకుండా, తండ్రిపై ఆయుధంగా కూడా ఉపయోగించింది’ అని న్యాయస్థానం పేర్కొంది.