దేశంలో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు, మరణాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు గత 24 గంటల్లో దేశంలో 602 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి మరో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 4440 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కేసులు కూడా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు.. దేశంలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 కేసులు కూడా భారీగానే బయట పడుతున్నాయి. మంగళవారం నాటికి దేశంలో నమోదైన జేఎన్ 1 కేసుల సంఖ్య 312 కి చేరుకున్నాయి. ఇందులో 47 శాతం కేసులు కేరళలో నమోదయ్యాయని ప్రభుత్వ ఆరోగ్య విభాగం ఇన్సాకాగ్ తెలిపింది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తిని ఇప్పటివరకు గుర్తించినట్టు ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. అత్యధికంగా కేరళలో 147 జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ కేసులు వెలుగు చూడగా.. గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో ఒక కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ద్వారా స్పష్టం అవుతోంది.