అస్సాంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజం ప్రాంతంలో బస్సు ట్రక్కు ఢీకొన్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. ఈ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మరణాల సంఖ్య ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు వెళ్తున్న బస్సు.. అదే మార్గంలో ఎదురుగా బొగ్గు లోడుతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందగానే వెంటనే అక్కడికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అక్కడి నుంచి తీవ్రంగా గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొంత మంది పరిస్థితి తీవ్రంగా విషమించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నట్లు పోలీసులు వివరించారు. అయితే ఈ ప్రమాదంలో అటు బస్సు డ్రైవర్, ఇటు ట్రక్కు డ్రైవర్ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.