ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుల ఉచ్చులో పడొద్దు.. అందుకే రెచ్చగొడుతున్నారు: పవన్ కళ్యాణ్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 05, 2024, 10:10 PM

ఏపీలో తాము ఓడిపోతున్నట్లు గుర్తించడం వల్లే కులాస్త్రాన్ని వైఎస్సార్‌సీపీ ప్రయోగిస్తోందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కొందరు కాపు పెద్దలను రెచ్చగొట్టి జనసేన పార్టీని బలహీనపరిచేలా కుట్రలకు దిగుతోందని.. ఆ వలలో కాపు సామాజికవర్గం పడవద్దని పిలుపునిచ్చారు. స్వప్రయోజనాల కోసం వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఈ విషప్రచారపు ఉచ్చులో పడొద్దని.. ఆ వార్తలను కాపులతో పాటు సామాన్య ప్రజలూ నమ్మవద్దని విన్నవించారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు.. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.


‘రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసింది. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. జనసేనపైనా, నాపైనా సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్‌ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు కచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని నేను బలంగా విశ్వసిస్తాను. రాష్ట్రంలో పట్టాలు తప్పిన పాలనను సరిదిద్దే క్రమంలో కాపు సామాజిక వర్గం ఒక గురుతర బాధ్యత వహించబోతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన - తెలుగు దేశం పొత్తుకి ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి’ అన్నారు.


‘ఈ క్రమంలో నేను ఏ నిర్ణయం తీసుకున్నా... ఏం మాట్లాడినా అందుకు ఒక బలమైన హేతువు ఉంటుంది. దూరదృష్టితో... దీర్హకాలిక రాష్ట్ర ప్రయోజనాలను లక్ర్యించి పని చేస్తాను. అవి ఇప్పటికిప్పుడు కంటికి కనిపించకపోవచ్చు. నేను లక్ష్యించినవి, ఆశించినవి నెరవేరిన రోజున - నన్ను అపార్ధం చేసుకొని, ఈ క్షణం దూపిస్తున్న కాపు పెద్దలు కచ్చితంగా హర్షిస్తారు. కాపు రిజర్వేషన్‌ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్‌ క్రిమినల్‌ బ్రెయిన్‌ ఆ తరవాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది. కాపులకు రిజర్వేషన్‌ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి వెళ్ళి జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన శ్రీ జగన్‌ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు కార్పొరేషన్‌ కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలి. సంక్షేమ పథకాల ద్వారా కాపులకు వెళ్ళే లబ్ధిని కూడా కాపు కార్పొరేషన్‌ లెక్కల్లో చూపించడం ఏమిటని అడగండి. ఈ.డబ్యూ.ఎస్‌ రిజర్వేషన్లో కాపులకి ఇచ్చిన కోటాను తొలగించిన వ్యక్తిని ప్రశ్నించాలి’అన్నారు పవన్ కళ్యాణ్.


‘కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ, తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి. నేను ఇంకా శాసన సభలోకి అడుగుపెట్టలేదు. నాతోపాటు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్న నాకు ముందరి కాళ్ళకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలియచేస్తున్నాను. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తూనే నిర్ణయాలు తీసుకొంటాను అని తెలియచేసుకొంటున్నాను' అంటూ లేఖలో ప్రస్తావించారు.


‘రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. అదే రీతిలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి నేను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకి, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారింది. జనసేనకు శాసన వ్యవస్థలో స్థానం లేకపోయినా ప్రజా జీవనంలో బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా నిలిచినందుకే ఎన్నో దాడులు... దిగజారిన విమర్శలు చేస్తోంది వైసీపీ. అసభ్యకర దూషణలకి దిగి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నాం' అన్నారు.


‘అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్దిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీ కి జీర్ణం కావడం లేదు. ఈ క్రమంలోనే కులపరమైన అస్తాన్ని వైసీపీ ప్రయోగిస్తోంది. అందులో భాగంగా- నేను గౌరవించే కాపు పెద్దలను రెచ్చగొట్టి... పార్టీని బలహీనపరచే దుష్ట ప్రయత్నాలకు ఒడిగడుతోంది. సదరు కాపు పెద్దలు ఆ విధంగా మాట్లాడటానికి వారి కారణాలు వారికి ఉండవచ్చు. వాటిని నేను సహృదయంతో అర్ధం చేసుకోగలను. వారి దూషణలను నేను దీవెనలుగా తీసుకొంటాను అని తెలియచేస్తున్నాను. రాష్ట్ర విస్పృత ప్రయోజనాలను కాంక్షిస్తూ నేను తీసుకొనే నిర్ణయాలకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన ఆవిర్భావం నుంచీ నేటి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాల కోసమే అడుగులు వేస్తున్నాను అని అందరికీ తెలుసు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సాధికారతతోపాటు, అగ్ర కులాల్లోని పేదలకు అండగా నిలిచి వారి ఆర్థిక ఉన్నతికి దోీహదపడాలన్నదే నా ఉద్దేశం. కులాలను కలిపే ఆలోచనా విధానంతోనే అందరూ ఒక తాటిపైకి రాగలరని విశ్వసిస్తాను. అన్ని కులాలను కలుపుకొని అడుగులు వేసే సమర్ధత కాపులకు ఉంది కాబట్టే పెద్దన్న పాత్ర తీసుకోవాలని కోరాను. కులాలు, వర్గాల మధ్య ఎన్ని అపోహలు ఉన్నా ప్రజలందరి కనీస అవసరాలు, కనీస ప్రయోజనాలు సాధించుకొనే క్రమంలో అందరూ కలసి నడవాలి’ అని జనసేనాని పిలుపునిచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com