ఏపీలో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నం.2ను జారీ చేసింది. ఆరు నెలలపాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత కూడా విధించారు. దాదాపు రూ.3 వేలు తగ్గించి.. రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. తాజా జీవో నంబర్ 2తో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎస్మా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణించింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చెయ్యకూడదని ఆదేశాలు ఇచ్చారు. నేటి నుంచి 6 నెలల పాటు సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.
2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తాయంటోంది ప్రభుత్వం. 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెలో ఉన్నవారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో అంగన్వాడీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా సఫలం కాలేదు. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని డిమాండ్ పరిష్కారం వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఎస్మాను ప్రయోగించింది.