ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియా కూటమికి 'అయోధ్య' టెన్షన్

national |  Suryaa Desk  | Published : Sat, Jan 06, 2024, 03:31 PM

రామజన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన విపక్ష కూటమిని చిక్కుల్లో పడేసింది. ఈ మహత్తర ఘట్టంపై ఎలా స్పందించాలో తెలియక కొందరు సతమతమవుతుంటే..కొందరు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై ఉన్న తమ అక్కసును వెళ్లగక్కే క్రమంలో రాముడిపైనే నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయ కార్యక్రమంగా మార్చేసిందని ఆరోపిస్తూ విపక్షాలు తమకు తెలియకుండానే క్రెడిట్‌ను కాషాయదళం ఖాతాలో వేస్తున్నాయి. బీజేపీ కొత్తగా దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరమేమీ లేదు. ఆయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తామంటూ 1991 నుంచి తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే చెబుతూ వచ్చింది. ఒకదశలో బీజేపీని కాంగ్రెస్ సహా ఇతర రాజకీయ పార్టీలు హేళన కూడా చేశాయి. రామమందిరం కేవలం బీజేపీకి రాజకీయ ముడిసరుకే తప్ప వారు అక్కడ నిర్మించరు అంటూ విమర్శించారు. ఎప్పుడు నిర్మిస్తారో తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారు. తీరా చెప్పింది చేసి చూపిస్తుంటే.. విపక్షాలకు పాలుపోవడం లేదు. ఈ క్రమంలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వారిలోని అసహనాన్ని బయటపెట్టగా.. రాజకీయంగా బీజేపీకి మరింత లాభించేలా ఉన్నాయి.


 


రాముడు మాంసాహారి అంటూ మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) సీనియర్ నేత జితేంద్ర అవద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శల వర్షంతో ఆయన వెంటనే పొరపాటు గ్రహించి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. జనవరి 2న మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హోలల్‌కెరె ఆంజనేయ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాముడితో పోల్చారు. అయోధ్యలోని రామ మందిర శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ (SP) నేత స్వామి ప్రసాద్ మౌర్య హిందూ మత గ్రంథాలను మరియు దేవుళ్లను కించపరచడమే రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో డీఎంకే (DMK) మంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని “మలేరియా – డెంగ్యూ” వంటి వైరస్‌తో పోల్చారు. విపక్ష కూటమిలోని వేర్వేరు పార్టీలకు చెందిన నేతల మాటలు రాజకీయం ఆయా పార్టీలకు ఏమాత్రం లాభం తెచ్చిపెట్టకపోగా.. మొత్తం కూటమికే నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. బీజేపీ పాలనతో విసిగిపోయిన ప్రజలను తమ వివాదాస్పద వ్యాఖ్యలతో సంఘటితం చేస్తున్నామన్న భ్రమలో కొందరు నేతలు ఉండవచ్చు. కానీ వారి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ పరోక్షంగా కమలదళానికే సహకరిస్తున్నారన్న అభియోగాలు వ్యక్తమవుతున్నాయి.


 


విపక్షాలు ప్రతి సందర్భంలోనూ లేవనెత్తే అంశం లౌకికవాదం. నిజానికి ఈ లౌకికవాదం దేశంలోని మెజారిటీ ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. ఇంకా చెప్పాలంటే లౌకికవాదం పేరుతో గతంలో కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు మైనారిటీ వర్గాలను ఆకట్టుకోవడం కోసం మెజారిటీ ప్రజల విశ్వాసాలను గాయపరుస్తూ వచ్చాయి. లౌకికవాదం అంటే రాజకీయాలను, మతాన్ని వేరుగా చూడడం. కానీ లౌకికవాదం పేరుతో ఒకట్రెండు మతాలకు పెద్దపీట వేసి, బుజ్జగింపు రాజకీయాలు చేశారన్న భావనే మెజారిటీ ప్రజల్లో నాటుకుపోయింది. అదే భారతీయ జనతా పార్టీకి రాజకీయ ముడిసరుకుగా మారింది. ఇకనైనా విపక్షాలు ఈ విషయంలో మేల్కొనకపోతే.. వారు నమ్ముకున్న నకిలీ లౌకికవాదమే వారి కొంప ముంచేస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మతపరమైన విషయాల్లో ఈ నాయకులు కాస్త సంయమనం పాటిస్తే రాజకీయంగా వారికి కొంతైనా ఉపయోగపడుతుందని.. లేదంటే ఇప్పటికే హిందూ వ్యతిరేకులుగా ముద్ర పడ్డ ఈ పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు.


 


విగ్రహ ప్రతిష్ఠాపనకు వెళ్లాలా వద్దా?


 


రామజన్మభూమిపై రామాలయాన్ని నిర్మించడంతోనే విపక్షాలకు నోటమాట రాకుండా చేసిన బీజేపీ, ఇప్పుడు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ విపక్ష పార్టీల ముఖ్యనేతలకు పంపిన ఆహ్వానాలు వారిని మరింత ఇరకాటంలో పడేశాయి. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి. హాజరుకావాలా వద్దా అన్న విషయంలో కాంగ్రెస్ ఇంకా ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆహ్వానం అందుకున్నవారిలో మరో నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అస్పష్టమైన సమాధానం ఇచ్చారు. "రాముడు పిలిస్తే వెళ్తాను" అంటూ ఆయన చెప్పుకొచ్చారు. శివసేనకు చెందిన సంజయ్ రౌత్ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అయోధ్యకు వెళతారని, అయితే “బీజేపీ కార్యక్రమం ముగిసిన తర్వాత మాత్రమే” వెళ్తారు అని చెప్పారు. ఇలాంటి గజిబిజి ప్రతిస్పందనలు విపక్ష కూటమిలోని అనేక పార్టీల నేతల నుంచి వచ్చాయి. సీపీఐ(ఎం)నేత సీతారాం ఏచూరి అయోధ్యకు వెళ్లేందుకు నిర్ద్వంద్వంగా నిరాకరించగా, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) జనవరి 22న అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని "బీజేపీ కార్యక్రమం"గా అభివర్ణిస్తూ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించింది.


 


ఎన్నికలు జరిగే ఏడాదిలో అతిపెద్ద ఈవెంట్‌గా మారిన విగ్రహ ప్రతిష్టాపన వేడుకపై విపక్షాలకు చెందిన నేతలంతా చేస్తున్న ఆరోపణ ఒక్కటే.. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, రాజకీయంగా ఉపయోగించుకుంటోంది అని విమర్శిస్తున్నారు. బీజేపీ దీన్ని ఒక భారీ ఈవెంట్‌గా నిర్వహించడం విపక్షాలకు సహించకపోవవచ్చు. కానీ అయోధ్యలోని రామజన్మభూమిలో రామమందిరాన్ని నిర్మించడం అనేది 1991 నుండి బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉంది. కరసేవకులను సమీకరించిన విశ్వహిందూ పరిషత్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు సైతం 1990 అక్టోబర్ నెలలో జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాదు, రామ మందిరం గురించి బీజేపీ నేతలు మాట్లాడిన ప్రతిసారీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు “అక్కడ గుడి కట్టిస్తాం అంటారు, కానీ ఎప్పటికీ చేయరు” అనే రీతిలో హేళన చేశాయి. అవాంతరాలు, హేళనలు, ఎద్దేవాలను అధిగమించి చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తున్న బీజేపీ.. ఈ కార్యక్రమాన్ని భారీ వేడుకగా జరుపుకోవడంలో తప్పుబట్టడానికి ఏమీ లేదుంటున్నారు కొందరు నేతలు..


 


తమ రాజకీయాల దృష్ట్యా ప్రతిపక్షాలు శంకుస్థాపనకు వెళ్లడానికి, వెళ్లకపోవడానికి తగిన స్పష్టమైన కారణాలను బయటపెట్టాలని.. ఇంతకు మించి ఏం చేసినా గందరగోళం సృష్టిస్తుంది తప్ప మరేమీ ఉండదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. అదే సమయంలో దేశ జనాభాలో 80 శాతం ప్రజలు అనుసరిస్తున్న హిందూ మతాన్ని, వారి విశ్వాసాలను వీలైతే గౌరవించాలి తప్ప మనోభావాలు గాయపరిచేలా ప్రవర్తించకుండా ఉండడమే విపక్షాలకు మేలు చేసే అంశం అవుతుందని గ్రహించాలని సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com