ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రా.. కదలి రా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే.. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనగా.. పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో టీడీపీ, జనసేన జెండాలతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కూడా దర్శనం ఇచ్చాయి. అది కూడా కేవలం అభిమానం చాటుకోవటానికి ప్రదర్శించిన జెండాలు మాత్రమే కాదు.. సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వాటిపై రాసి ఉండటం గమనార్హం. టీడీపీ కార్యకర్తలే ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాసుకొచ్చారు. ఈ జెండాలను చూసిన మిగతా టీడీపీ నేతలు.. వాటిని పక్కన పడేసినట్టు సమాచారం. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
అయితే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావటం రాష్ట్రమంతా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పార్టీలకతీతంగా చాలా మంది స్పందించారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా స్పందించకపోవటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే.. అరెస్ట్ సమయంలో బాలకృష్ణ మాత్రం టీడీపీకి అంతా తానై వ్యవహరించారు. ఇలాంటి సమయంలో.. ఇప్పుడు ఎన్టీఆర్ జెండాలు ప్రదర్శించటం సర్వత్ర చర్చకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే.. సభలో చంద్రబాబు ప్రసంగం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని అందరు వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కానీ.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్‌ను మాత్రం ఒక్క మాట కూడా అనకపోవటం.. కనీసం ఆయన పేరు కూడా ప్రస్తావించకపోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. కార్యకర్తలంతా మైలవరం, మైలవరం అంటూ కార్యకర్తలంతా అరవటంతో అప్పుడు ఏదో ముక్తసరిగా ఏదో అన్నారు తప్ప.. విమర్శలు మాత్రం చేయలేదు. దీంతో.. ఇదే విషయంపై ఇప్పుడు పార్టీలో చర్చ నడుస్తోంది.