తెలుగు గంగ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన కండలేరు రిజర్వాయర్ కోసం సర్కారు భూములను సేకరించింది. ఈ క్రమంలో అసైన్డ్ భూముల ఇచ్చిన వారికి కేవలం ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లించగా.. వారు కోర్టుకు ఎక్కారు. తమకూ అన్ని ప్రయోజనాలు అందజేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై సింగిల్ జడ్జ్ అనుకూలంగా తీర్పు చెప్పారు. దీంతో ప్రభుత్వం దీనిని డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఆ తీర్పును తాజాగా హైకోర్టు సమర్దించింది. పరిహారానిక వారూ అర్హులేనని చెప్పింది.
తెలుగు గంగ ప్రాజెక్ట్ భూసేకరణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కామన్ జాయింట్ ఫార్మింగ్ స్కీమ్ (సీజేఎఫ్ఎస్) కింద భూములు పొందినవారికి కూడా అసైనీదారులతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు భూ యజమానులకు చెల్లించిన విధంగానే అసైనీదారులకు నష్టపరిహారం, ఇతర ప్రయోజనాలు కల్పించాల్సిందేనని గతంలో మేకల పాండు కేసులో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం సమర్ధించిందని పేర్కొంది.
ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని సేకరించినప్పుడు సీజేఎఫ్ఎస్ఏ భూములు కొల్పోయేవారు కూడా అసైనీదారులతో సమానంగా ప్రయోజనాలు పొందేందుకు అర్హులేనని తేల్చిచెప్పింది. అసైన్డ్ పట్టా పలు షరతులకు లోబడి ఉంటుందనే కారణంతో వారి హక్కులను హరించడానికి వీల్లేదని ఉద్ఘాటించింది. తెలుగుగంగ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన కండలేరు రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోయిన ఆసైన్డ్ నిర్వాసితులకు ఇతరులతో సమానంగా పరిహారం, ప్రయోజనాలు కల్పించాల్సిందేనని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించిన డివిజన్ బెంచ్.. తెలుగుగంగ ప్రాజెక్ట్ భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్. రఘునందనరావుతో కూడిన ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా రాపూరు మండలం గుండవోలు గ్రామానికి చెందిన మద్దె రామయ్య సహా మరో ముగ్గురికి 1978లో అప్పటి ప్రభుత్వం 6.19 ఎకరాల భూమికి డీకేటీ పట్టాలు మంజూరు చేసింది. అయితే, కండలేరు రిజర్వేయర్ కోసం సంబంధిత భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనికి అధికారులు ఎక్స్‌గ్రేషియా మాత్రమే చెల్లించడంతో నిర్వాసితులు 2009లో కోర్టుకెక్కారు. తమకూ ఇతర రైతులతో సమానంగా నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. అసైనీదారులకు కూడా ప్రైవేటు భూ యజమానులతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పారు. దీంతో తీర్పును సవాల్ చేస్తూ తెలుగుగంగ ప్రాజెక్ట్ ప్రత్యేక కలెక్టర్ డివిజన్ బెంచ్2కు అప్పీల్ వేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు అసైనీదారులు కాదన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వ న్యాయవాది వాదనను తోసిపుచ్చి పైవిధంగా తీర్పు వెలువరించింది.