తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన బిగ్ డిబేట్‌లో సీఎం అయ్యాక తొలిసారి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్ మర్యాదపూర్వకంగానైనా కనీసం ఫోన్ చేయలేదని అన్నారు. కాలం కలిసి వస్తే నేడు కాకపోతే రేపైనా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులకు మనోధైర్యం వచ్చిందని, కేసీఆర్, జగన్ కలిసిపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు. సహజంగా కొత్తగా సీఎం అయితే మర్యాద కోసమైనా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేస్తారని, జగన్ నుంచి మాత్రం నాకు ఫోన్ రాలేదని వ్యాఖ్యానించారు. తాను సీఎం కావడం ఆయనకు ఇష్టం లేదేమో అనేది తెలియదన్నారు. కానీ... ఇద్దరం కలిసి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఉన్నాయి కదా! అని పేర్కొన్నారు. అంతేకాదు, తనకు జగన్‌తో వ్యక్తిగత వైరం లేదని, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పారు.
నేను విపక్షంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉండేవాడినని, రాజశేఖర్ రెడ్డితోనే కొట్లాడేవాడ్ని, అదే పరంపర కొనసాగిందని రేవంత్ అన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ బతకనే బతకదు.. దాని పని అయిపోయింది అన్నారు కదా! అదునొచ్చిప్పుడు పంట పండేది ఎంత సేపు. కాలం కలిసొస్తే ఇవాళ కాకపోయినా రేపైనా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మారుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షర్మిల తన ఇంటికి కుమారుడి పెళ్లి కార్డు తీసుకుని వచ్చిన విషయం గురించి మాట్లాడుతూ.. ఆమె మా పార్టీ నాయకురాలని, తప్పకుండా మా మధ్య రాజకీయాలు చర్చ జరుగుతాయన్నారు. నా వంతు మద్దతు ఆమెకు ఉంటుందని, ఏపీలో పరిస్థితులు చక్కదిద్దాలని చెప్పారు. అన్ని రకాలుగా నైతికంగా, రాజకీయంగా తాను అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని, ఎన్నికల్లో లీడ్ చేయాలని అన్నారు.
అంతేకాదు, షర్మిలకు మద్దతు ఇస్తే పార్టీకి ప్రయోజనం అని రాహుల్ గాంధీ చెబితే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ దిశగా ముందుకు వెళతానని పేర్కొన్నారు. అలాగే, ‘తాను రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అనుకుంటుంటే.. జగన్ నరేంద్ర మోదీ కావాలని అనుకుంటున్నారు.. కేసీఆర్‌ను ఓడించాలని నేను పోరాడితే.. ఆయనను గెలిపించాలని ఏపీ సీఎం అనుకున్నారు. అయినా...నేను ఆయన మా ప్రత్యర్థిగా భావించడం లేదు.. నాకు అంత అవసరం లేదు. కర్ణాటక, తమిళనాడు ఎంతో, ఏపీ కూడా అంతే.’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.