ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌పై మాల్దీవులు ఎంపీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతేడాది నవంబర్ వరకు భారత్, మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే గత నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం మారిపోయి.. చైనా అనుకూల, భారత వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటినుంచి భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు కాస్త చెడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే మాల్దీవులకు చెందిన ఓ ఎంపీ.. చేసిన కామెంట్లు ఆ దేశానికి గట్టిగానే షాక్ ఇచ్చాయి.
లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవులకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో #BoycottMaldives అనే హ్యాష్‌ట్యాగ్ నెట్‌లో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు.. ఇప్పటికే మాల్దీవులు వెళ్లేందుకు ట్రిప్ బుక్ చేసుకున్న వారు ఆ పర్యటనలను రద్దు చేసుకుంటున్నారు. ఈ జాబితాలోకి సెలెబ్రిటీలు కూడా చేరిపోయారు.
భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేస్తున్నారని.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మాల్దీవులకు అధిక సంఖ్యలో పర్యాటకులు పంపించే భారత్ పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. పొరుగు దేశాలతో భారత్ మంచిగా వ్యవహరిస్తుంటే.. వాళ్లు మాత్రం ద్వేషం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. మన సొంత పర్యాటకానికి మద్దతివ్వాలని అక్షయ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ వ్యవహారంపై స్పందించిన నటి శ్రద్ధా కపూర్.. లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయని.. సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇక లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. అక్కడ తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. లక్షద్వీప్ తీరప్రాంతం మనం కోరుకునే దాని కన్నా ఎక్కువగా ఇస్తుందని తెలిపారు. లక్షద్వీప్‌లోని అందమైన బీచ్‌ల్లో ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించడం చూసి ఆనందంగా ఉందని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అన్నారు. లక్షద్వీప్ మన భారతదేశంలోనే ఉండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. దేశంలోని సెలబ్రిటీలు అందరూ భారత్‌కు మద్దతుగా.. ట్వీట్లు చేస్తున్నారు.