ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత 1999 నుంచీ పార్లమెంటు ఎన్నికలతోపాటు జరుగుతున్నాయి. ఇలా రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు వరుసగా అప్పటి నుంచి 2019 వరకూ ఐదుసార్లు జరిగాయి. లోక్ సభతోపాటు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే పనిలో ఆంధ్రప్రదేశ్‌కి జతగా పక్కనున్న ఒడిశా. ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వచ్చి కొన్నేళ్ల క్రితం చేరాయి. ఈ ఎన్నికల నిర్వహణ చరిత్రను ఒక్కసారి వెనక్కి వెళ్లి పరిశీలిస్తే– ఈ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు, 16వ లోక్ సభకు 2014లో, 2019లో కూడా మార్చి 15 లోపే ఎన్నికల తేదీలను (షెడ్యూలు) భారత ఎన్నికలసంఘం ప్రకటించిందని తెలుస్తుంది. 2014 ఎన్నికలకు అదే ఏడాది మార్చి 5న అన్ని తేదీలను (ఎన్నికల నోటిఫికేషన్ జారీ మొదలు ఓట్ల లెక్కింపు వరకూ) ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 17వ లోక్ సభ ఎన్నికలతోపాటు జరిగిన 15వ ఏపీ అసెంబ్లీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికల షెడ్యూలును 2019 మార్చి 10న ఎన్నికల సంఘం వెల్లడించింది. సాధారణ ఎన్నికల షెడ్యూలును ప్రకటించే మీడియా సమావేశంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) కీలక సమాచారం వెల్లడిస్తూ ప్రసంగిస్తారు. తేదీలు, ఇతర వివరాలను ఈసీఐ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో అందజేస్తారు. 2014 సాధారణ ఎన్నికలను 9 దశల్లో నిర్వహించారు. 2019 ఎన్నికలను 7 దశల్లో జరిపారు. 17వ లోక్ సభ ఎన్నికలతోపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మిగతా అన్ని ఫలితాలతోపాటు మే 23న ప్రకటించారు. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కనీవినీ ఎరగని అత్యధిక మెజారిటీ సాధించిన వైయస్ఆర్‌సీపీ సర్కారు ఫలితాలొచ్చిన వారానికి జగన్ గారి నేతృత్వంలో కొలువుదీరింది. షెడ్యూలు ప్రకటించే సమయం ఇంకా 2 నెలలే ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వాన్ని మరో ఐదేళ్లకు ఎన్నుకోవడానికి ఆంధ్రా ఓటర్లు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల వేడి చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకున్న పెద్ద తెలుగు రాష్ట్రంలో ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన తర్వాత మరోసారి పండగ వాతావరణం నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.