రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్య నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందే వారం రోజుల నుంచి వివిధ క్రతువులు జరగనున్నాయి. ఆ కార్యక్రమాలకు భక్తులు ఇప్పటి నుంచే తరలివస్తున్నారు. దీంతో అయోధ్య నగరంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వంద ఎలక్ట్రిక్ బస్సులను రంగంలోకి దించింది. పర్యావరణానికి హాని కలిగించే పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులు ఈ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగించడం వల్ల రద్దీ, కాలుష్యం తగ్గి పర్యావరణ హితంగా ఉంటుందని భావిస్తోంది.
ఈ నెల 22 వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్నా.. ఇప్పటికే అయోధ్య పురవీధుల్లో భక్తులు భారీగా పెరుగుతున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ జన్మభూమి, ఇతర ఆలయాలను సందర్శించే భక్తులు, పర్యాటకుల కోసం మౌలిక వసతుల సదుపాయాల కల్పనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు.. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే భక్తుల వాహనాలతో పెరిగే రద్దీని అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం తాత్కాలిక పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 15 వ తేదీన ధర్మ పథ్, రామ్ పథ్ ప్రాంతాల్లో 100 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ నితీశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. బస్సులతోపాటు ఎలక్ట్రిక్ రిక్షాలు కూడా సమకూర్చనున్నట్లు తెలిపారు. మరోవైపు.. సాకేత్ పెట్రోల్ పంప్ నుంచి లతా మంగేష్కర్ చౌక్ వరకు భక్తుల వాహనాలను ఉంచేందుకు తాత్కాలికంగా పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే తర్వాత ఆ ప్రాంతంలోనే శాశ్వత పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ నితీష్ కుమార్ తెలిపారు. ఉదయ చౌక్ వద్ద చౌదా కోసి, పంచ కోసి మార్గాల్లో పార్కింగ్ కోసం 70 ఎకరాల స్థలం సేకరించినట్లు వెల్లడించారు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.