పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలను నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి.తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సభలో ప్రవేశపెడతారు.ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పద్దు ఇది. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకోవడమే. బ్రిటీష్ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈసారి ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు.అయితే, ఎన్నికల ముందు మహిళా రైతులకు కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో శుభవార్త చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రెట్టింపు చేసే ప్రతిపాదనలు ఉండొచ్చు. ఇటీవల శీతాకాల సమావేశాల్లో దుండగులు రంగుల పొగతో సృష్టించిన అలజడి పార్లమెంట్ భద్రతపై ఆందోళనలు రేపిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి భద్రతను కట్టుదిట్టం చేశారు.