దేశ ఆర్థిక రాజధాని ముంబైకి మరో మణిహారంలా దేశంలోనే అత్యంత పొడవైన సీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ - ఎంటీహెచ్‌ఎల్ (అటల్ సేతు) ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ అటల్ సేతు నిర్మించడం వల్ల ప్రస్తుతం 2 గంటలు పడుతున్న ప్రయాణం.. కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనపై నిత్యం 70 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గౌరవార్థం ఈ వంతెనకు అటల్ సేతు అని నామకరణం చేశారు.
ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ ఈ అటల్ సేతును నిర్మించారు. ఈ అటల్ సేతు వంతెన పొడవు మొత్తం. 21.8 కిలోమీటర్లు. ఇందులో 16.5 కిలోమీటర్లు అరేబియా సముద్రంపైనే కట్టారు. ఈ వంతెనను రూ.21,200 కోట్ల వ్యయంతో 6 లేన్లుగా నిర్మించారు. ప్రస్తుతం సేవ్రీ నుంచి నవా షేవాకు 2 గంటల సమయం పడుతుండగా.. ఈ వంతెనపై ప్రయాణిస్తే కేవలం 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నవా షేవాకు చేరుకోవచ్చని అధికారులు వెల్లడించారు. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు.
ఈ అటల్ సేతుపైకి టూ వీలర్స్, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై నిత్యం రోజూ 70 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక శీతాకాలంలో ఇక్కడికి వలస వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై సౌండ్ బారియర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక సముద్రపు జీవులకు హాని కలిగించని లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చినట్లు వివరించారు. ఈ అటల్ సేతు నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై పటిష్ఠ బందోబస్తులో భాగంగా 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అటల్ సేతుపై ఏదైనా వాహనం ఆగిపోయినా.. పాడైనా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఆ సీసీటీవీ కెమెరాలు సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. వెంటనే పోలీసులు అలర్ట్ అయి చర్యలు చేపట్టనున్నారు.