ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భారీ భూకంపం ధాటికి భారత్, పాకిస్థాన్‌లలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్థాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో భారీ భూకంపం నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఈ శక్తివంతమైన భూ కంపం ధాటికి భారత్, పాకిస్థాన్ దేశాల్లో కూడా భారీ ఎత్తున ప్రకంపనలు సంభవించాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారత రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సుమారు 30 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
భూ కంపం ధాటికి ఇళ్లు, కార్యాలయాల్లోని ఫ్యాన్లు, ఇతర వస్తువులు ఊగినట్లు జనం తెలిపారు. వాటికి సంబంధించిన వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతోపాటు జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా, దక్షిణ పీర్ పంజాల్ ప్రాంతాల్లోనూ భూ కంపం తీవ్రత కనిపించినట్లు అక్కడి వారు తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడినట్లు చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో 6.1 తీవ్రతో సంభవించిన భూకంపం ధాటికి పాకిస్థాన్‌లో కూడా భూమి కంపించినట్లు పాక్ నేషనల్ మీడియా జియో న్యూస్ వెల్లడించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ ఫఖ్తుఖ్వా సహా పలు ప్రావిన్స్‌లలో భూ ప్రకంపనలు నమోదైనట్లు తెలిపింది.
బుధవారం కూడా కూడా అఫ్గానిస్థాన్‌లో 4.1 తీవ్రతతో భూమి కంపించింది. సాధారణంగా ఆసియా ఖండంలో భూకంపాలు అధికంగా వస్తుంటాయి. మరీ ముఖ్యంగా హిమాలయ పర్వత ప్రాంతాలైన భారత్‌లోని జమ్మూ కాశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఖనిస్థాన్, తజకిస్థాన్‌లు హింద్ కుష్ హిమాలయాన్ జోన్‌కు చుట్టుపక్కల వీటి కేంద్రాలు ఉంటాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక భూకంపాలు నమోదయ్యే జోన్ల జాబితాలో ఇది కూడా ఒకటి. భారత ఉపఖండ భూ ఫలకం యూరేషియా ఫలకంతో ఢీకొనడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.