సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సందర్భంలో వచ్చే పండుగను మకర సంక్రాంతి అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే దక్షిణాయనం పూర్తయి.. ఉత్తరాయణం మొదలవుతుంది. అయితే రాశులనేవి లేవు.. అవి కల్పితాలన్న బాబు గోగినేని.. ఈ రాశుల్లో చెబుతున్న నక్షత్రాలు ఒకదానికొకటి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయన్నారు. రాశులు ఉన్నా వాటిల్లోకి సూర్యుడు వెళ్లడం జరగదన్న ఆయన.. మకర రాశి నిజం కాదని.. సంక్రమణ జరగదన్నారు. ఉత్తరాయణం 20 రోజుల కిందటే మొదలైందని బాబు గోగినేని తెలిపారు. జోతిష్యులు చెబుతున్నది అబద్దమన్న ఆయన.. ఈ విషయంలో పంచాంగం కూడా తప్పేనన్నారు. పొంగల్ నిజమన్న ఆయన.. అది రైతుల పండుగ, వంటకమన్నారు. తమిళులు సంక్రాంతి పండుగను పొంగల్ పేరిట ఘనంగా జరుపుకుంటారనే సంగతి తెలిసిందే.
పంచాగంలో ఉత్తరాయణం 14/15 జనవరిలో ఆరంభం అని ఉంటుందని.. కానీ ఉత్తరాయణం డిసెంబర్ 21/22 నే మొదలైందని బాబు గోగినేని తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి వెళ్లడం జరగదని.. సూర్యుడి చుట్టూ పరిభ్రమించే భూమి మీద ఉన్నాం కాబ్టటి మనకు అలా అనిపిస్తుందని బాబు గోగినేని వివరణ ఇచ్చారు. ‘సూర్యోదయం, సూర్యాస్తమయం, గ్రహాల కదలిక, గ్రహణాల సమయాన్ని లెక్కలు వేసిన ప్రాచీన శాస్త్రవేత్తలు వ్యవసాయం ఉన్న అన్ని నాగరికతలలో ఉన్నారు. అది వేరు, నువ్వు డబ్బులు దొబ్బడానికి పెట్టుకున్న ఫలిత జోతిష్య దుకాణం వేరు’ అంటూ జోతిష్యం పేరిట డబ్బులు తీసుకొని రెమెడీలు చెప్పేవారిపై బాబు గోగినేని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.