జనవరి రెండో వారం పొంగల్ పంట పండుగ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. తమిళనాడు సంస్కృతికి చిహ్నంగా పరిగణించే ఈ జల్లికట్టు పోటీలు మధురై జిల్లాలో ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ జల్లికట్టు అనేది తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఒక సంప్రదాయమైన క్రీడ. ఇందులో ఎద్దులకు మనుషులకు మధ్య పోరాటం జరుగుతుంది. ఇక మధురైలో జల్లికట్టు నిర్వహించే ముందు అందులో పాల్గొనే ఎద్దులకు హెల్త్ చెకప్ కూడా చేశారు. వరుసగా 3 రోజుల పాటు సాగే ఈ జల్లికట్టు క్రీడలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ జల్లికట్టు పోటీలను అవనియాపురం ఇవాళ (సోమవారం)లో నిర్వహించారు. రెండో రోజు పాలమేడులో, మూడో రోజు అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలను నిర్వహించనున్నారు.
మరోవైపు.. కొత్తగా నిర్మించిన మధురై జల్లికట్టు స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. ఆ మైదానాన్ని ఈ నెల 23 వ తేదీన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. మధురై జిల్లాలోని అలంగనల్లూరు సమీపంలో నిర్మించినన ఈ కొత్త జల్లికట్టు స్టేడియానికి తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత దివంగత కరుణానిధి పేరు పెట్టారు. ఇక జల్లికట్టు పోటీల్లో పాల్గొనేవారు ఒక్కోసారి తీవ్రంగా గాయపడతారు. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన సుప్రీంకోర్టు జల్లికట్టు నిర్వహణకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. స్థానిక అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ జల్లికట్టు పోటీల సమయంలో పలువురు గాయపడుతునే ఉంటారు. గతేడాది సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో ఒక్క అవనియాపురంలోనే 60 మంది గాయపడ్డారు.