గతేడాది నవంబర్‌లో మాల్దీవుల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన మహ్మద్ మొయిజ్జూ.. భారత్ పట్ల తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలోనే భారత్ ఔట్ అనే నినాదాన్ని ఇచ్చిన మహ్మద్ మొయిజ్జూ అధికారంలోకి రాగానే అదే పని మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే భారత సైన్యం మాల్దీవుల భూభాగం నుంచి వెళ్లిపోవాలని పేర్కొన్న మహ్మద్ మొయిజ్జూ తాజాగా దానికి మార్చి 15 వ తేదీ చివరి తేదీ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలోనే 35 ఏళ్ల క్రితం మాల్దీవుల ప్రభుత్వాన్ని కాపాడిన భారత సైన్యాన్ని.. చైనా అండ చూసుకుని వెనక్కి వెళ్లాలని మాల్దీవులు అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చారు. మాల్దీవుల్లో ఆపరేషన్ కాక్టస్ నిర్వహించిన ఇండియన్ ఆర్మీ అప్పటి ప్రభుత్వాన్ని పడిపోకుండా చూసింది.
1988 నవంబరులో అప్పటి అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వంపై.. మాల్దీవులకు చెందిన బిజినెస్‌మెన్ అబ్దుల్లా లుతుఫీ తిరుగుబాటు చేశారు. ఆయనకు శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం గ్రూప్ మద్దతు తెలిపింది. నవంబరు 3 వ తేదీన ఈ శ్రీలంక గ్రూప్‌కు చెందిన 80 మంది కిరాయి సైన్యం.. శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలె చేరుకుంది. మాల్దీవుల్లోని పోర్టులు, రేడియో స్టేషన్లను ఆధీనంలోకి తీసుకుని ఈ కిరాయి సైన్యం అక్కడ బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడి భవనం వైపు దూసుకెళ్లగా.. ఆయన భద్రతా సిబ్బంది వెంటనే గయూమ్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులతో విరుచుకుపడిన కిరాయి సైన్యం కొందరు మంత్రులు, పౌరులను నిర్బంధించింది.
ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు గయూమ్ శ్రీలంక, పాకిస్థాన్, సింగపూర్‌లను సాయం కోసం అడగ్గా.. ఆ దేశాలు నిరాకరించాయి. అమెరికా ముందుకొచ్చినా.. సైన్యాన్ని పంపేందుకు సమయం పడుతుందని చెప్పింది. దీంతో అప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్ సూచనతో గయూమ్.. భారత్‌ను సాయం అడిగారు. వెంటనే స్పందించిన అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ.. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి.. భారత సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు.
అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ వీఎన్ శర్మ.. ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ కాక్టస్’ అని పేరు పెట్టారు. బ్రిగేడియర్ ఫారూఖ్ బల్సారా నేతృత్వంలోని 3 పారా కమాండో బృందాలు ఆగ్రా నుంచి మాలె ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాయి. అక్కడి నుంచి పడవల్లో మాలె నగరానికి చేరుకుని శ్రీలంక కిరాయి సైన్యంతో ఇండియన్ ఆర్మీ భీకర పోరు సాగించింది. దీంతో భారత సైనికుల పోరాటాన్ని చూసి శ్రీలంక కిరాయి ముఠా పారిపోయింది.
మరోవైపు.. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్‌ఎస్ గోదావరి, ఐఎన్‌ఎస్ బెత్వా.. ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డగించి వారిని పట్టుకున్నారు. ఈ యుద్ధంలో ఇద్దరు బందీలు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది శ్రీలంక కిరాయి ముఠా సభ్యులు హతమయ్యారు. దీంతో ‘ఆపరేషన్ కాక్టస్’ సక్సెస్ కావడంతో భారత్‌పై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపించాయి.
ఈ ఆపరేషన్ కాక్టస్ తర్వాత భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు మరింత బలంగా తయారయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన దాదాపు 70 మంది సైనికులు ప్రస్తుతం మాల్దీవుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను ఆ సైనిక బృందం చూస్తోంది. ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కొత్త అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జూ పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది.