అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించి బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రాముడు కలలో కనిపించి.. అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను రావట్లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడే ఈ తేజ్ ప్రతాప్ యాదవ్. ఈ సందర్భంగా బీజేపీపై తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం ఎన్నికల కోసమే బీజేపీ ఈ రామ మందిర ప్రారంభోత్సవాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రాముడిని మర్చిపోతారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఒక బహిరంగ సభలో ప్రసంగించిన తేజ్ ప్రతాప్ యాదవ్.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 22 వ తేదీన జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తాను హాజరు కాబోనని రాముడు తనకు కలలో కనిపించి చెప్పాడని పేర్కొన్నారు. రాముడు నలుగురు శంకరాచార్యుల కలలోకి వచ్చాడని.. అదే విధంగా తన కలలోకి కూడా వచ్చాడని చెప్పారు. ఈ రామ మందిర ప్రారంభోత్సవంలో కపటత్వం ఉందని.. అందుకే తాను రావడం లేదని రాముడు చెప్పినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొనడం గమనార్హం.
ఆది శంకరాచార్యులు స్థాపించిన 4 మఠాల పీఠాధిపతులైన నలుగురు శంకరాచార్యులు అయోధ్యలో జరగనున్న రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని ఇప్పటికే ప్రకటించారని.. వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. అయితే ఇటీవలె అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం విషయంలో బీజేపీని విమర్శించే క్రమంలో బిహార్ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఏదైనా అనారోగ్యం వస్తే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతారా లేక దేవుడి గుడికి వెళ్లి మొక్కుతారా అంటూ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఆ వ్యాఖ్యల పట్ల తేజ్ ప్రతాప్ యాదవ్ సున్నితంగా హెచ్చరించారు. మతం గురించి ప్రకటనలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరారు.