పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెన్నిస్ పోటీలు శనివారం ప్రారంభమై ఈనెల 24 వరకూ కొనసాగుతాయని పాఠశాల విద్య జోన్2 ఆర్జేడీ, కాకినాడ జిల్లా ఇన్‌చార్జి డీఈవో జి.నాగమణి తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్జేడీ మాట్లాడుతూ అండర్-19 పాఠశాల క్రీడాసమాఖ్య పురుషుల టెన్నిస్‌పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు వెల్లడించారు. పోటీలకు 23 రాష్ట్రాల నుంచి 109 మంది క్రీడాకారులు హాజరవుతున్నారన్నారు. పోటీల నిర్వహణ నిమిత్తం కాకినాడ డీఎస్‌ఏ, పాత ఎస్పీ కార్యాలయం వెనుక, డిమార్ట్ సమీపంలోని సింథటిక్ టెన్నిస్‌కోర్టులను ఫ్లడ్‌లైట్లతో సిద్ధంచేసినట్టు తెలిపారు. పోటీల నిర్వహణకు కలెక్టర్ కృతికాశుక్లా, జేసీ ఇలాక్కియా ఆదేశాల మేరకు వివిధ కమిటీలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు డీఎస్‌ఏలో పోటీలు ప్రారంభమవుతాయని పాఠశాల క్రీడాసమాఖ్య రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తిరాజు తెలిపారు. పోటీల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర క్రీడాసమాఖ్య నిధుల నుంచి రూ.6 లక్షలు మంజూరుచేశామన్నారు. 46 మంది కోచ్‌లు, 100 మంది స్థానిక అఫీషియల్స్ పోటీల నిర్వహణలో పాల్గొంటున్నారని తెలిపారు. సమావేశంలో పాఠశాల క్రీడాసమాఖ్య కార్యనిర్వహణా కార్యదర్శి బీవీవీఎస్వీ ప్రసాద్, డీవైఈవోలు ఆర్జే డేనియల్‌రాజు, డి.సుభద్ర, డీఎస్‌డీవో బి.శ్రీనివాస్‌కుమార్, పీడీలు రంగారావు, రవిరాజు, బంగార్రాజు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. ఏపీ జట్టుకు క్రీడాదుస్తులను ఆర్జేడీ అందజేశారు.