అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కలిగొట్లలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్ళితే.... కలిగొట్లలో నివాసం ఉంటున్న కొల్లి పద్మ తన కుమార్తె హంసిని (8)తో కలిసి సంక్రాంతికి గాజువాక చిట్టినాయుడు కాలనీలో గల అత్త వారింటికి వచ్చింది. పండుగ అయిపోయిన తరువాత హంసినిని పద్మ తన అత్తింటి వద్ద వదిలిపెట్టి కలిగొట్ల వెళ్లింది. శుక్రవారం సాయంత్రం హంసినిని తీసుకుని ఆమె బాబాయి కొల్లి వెంకటప్రసాద్ (31) ద్విచక్ర వాహనంపై కలిగొట్ల బయలుదేరాడు. వీరి వాహనాన్ని నాగదేవత కొండ సమీపంలో టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటనా స్థలాన్ని ఏడీసీపీ, ఏసీపీ సందర్శించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అచ్యుతాపురం సమీపంలోని దొప్పెర్లకు చెందిన కొల్లి పైడిరాజు 30 ఏళ్ల కిందట బతుకుతెరువు కోసం ఆటోనగర్ ప్రాంతానికి వచ్చారు. ఆయన భార్య దేముడమ్మ, వీరికి శివ, వెంకటప్రసాద్, శాంతి పిల్లలు. వీరిలో పెద్దకుమారుడు శివకు దేవరాపల్లి మండలం కలిగొట్లకు చెందిన పద్మతో వివాహమైంది. వారికి ఓ కుమార్తె హంసిని (8) ఉంది. కాగా శివ ఐదేళ్ల క్రితం దొప్పెర్ల వెళుతూ దేశపాత్రునిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటి నుంచి అతడి భార్య పద్మ తన కన్నవారింట ఉంటోంది. రెండో కుమారుడు వెంకటప్రసాద్ ఫార్మా కంపెనీలో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. అతడికి తన మామ కుమార్తెతో ఇటీవల వివాహం నిశ్చయమైంది. మరో మూడు నెలల్లో పెళ్లి జరగనుంది. ఈ లోగా తన అన్న కుమార్తెను ఆమె తల్లి దగ్గరకు తీసుకువెళుతుండగా జరిగిన ప్రమాదంలో వెంకటప్రసాద్ మృతిచెందాడు. ఐదేళ్ల క్రితం పెద్దకొడుకు, ఇప్పుడు చిన్న కొడుకు, మనమరాలు మృతిచెందడంతో వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే ప్రమాదంలో హంసిని మృతిచెందడంతో శివ భార్య పద్మ ఒంటరిగా మిగిలిపోయింది.