ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈనెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకం నిధుల్ని ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు. ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది.
ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2019 ఏప్రిల్ 11 వరకు మహిళలు తీసుకున్నటువంటి రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి వారికి 4 దశల్లో చెల్లిస్తుంది. వైఎస్సార్ ఆసరా పథకం అర్హుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారు. ఒకవేళ ఏవైనా అనుమానాలు ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్- 0863-2347302 ఇమెయిల్ ఐడి - supportmepma@apmepma.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. వైఎస్సార్ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేయడంతో పాటుగా ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. దీనికి తోడు అదనంగా పెద్ద ఎత్తున బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడంతో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో గత 56 నెలల కాలంలో వ్యాపారాలు బాగా పెరిగాయి. పేద కుటుంబాల్లో టర్నోవర్ పెరిగింది. దీంతో గ్రామాల్లో రూ.వందకు నెలకు రూ.2 లేదా రూ.3 వడ్డీ వ్యాపారాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 89.29 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. వారిలో సగానికి పైగా అంటే 54 శాతం మంది మహిళల నెల వారీ సరాసరి స్థిర ఆదాయం రూ.5 వేలకు పైనే అదనంగా పెరిగింది. అంటే ఏడాదికి రూ.60 వేలకు పైబడి అదనపు ఆదాయం చేకూరుతోంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలు తీసుకున్నటువంటి రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిగా ఉండాలి . డ్వాక్రా గ్రూపులో సభ్యురాలై ఉండాలి.. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్, లోన్ డాక్యుమెంట్ ఉండాలి. నివాస రుజువు పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఒకవేళ అర్హత ఉండి కూడా అకౌంట్‌లో డబ్బులు జమకాకపోతే అధికారుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.
వైఎస్సార్ ఆసరా
మొదటి విడత, 11 సెప్టెంబర్ 2020
అందించిన లబ్ధి రూ.6,318.76 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 77,87,295
రెండవ విడత, 07 అక్టోబర్ 2021
అందించిన లబ్ధి రూ.6,439.52 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,75,539
మూడవ విడత, 25 మార్చి 2023
అందించిన లబ్ధి రూ.6,417.69 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
నాల్గవ విడత, 23 జనవరి 2024
అందించిన లబ్ధి రూ.6,394.83 కోట్లు లబ్ధిదారుల సంఖ్య 78,94,169
వైఎస్సార్ ఆసరా ద్వారా 4 విడతల్లో అందించిన మొత్తం లబ్ధి రూ. 25,571 కోట్లు