ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ గురించి తెలియనివారు ఉండరు. ఐప్యాక్ సంస్థ ద్వారా.. 2019లో వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పీకే రాజకీయ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. ఆ పార్టీ ఏకంగా 151 సీట్లలో బంపర్ విక్టరీని అందుకుంది. అయితే ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత ఐప్యాక్ సంస్థకు దూరమయ్యారు.. అలాగే రాజకీయ వ్యూహాకర్తగా కూడా తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఐప్యాక్‌లో పనిచేసిన కొందరు మాత్రం వైఎస్సార్‌సీపీ కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారు. ఇంతలో పీకే ట్విస్ట్ ఇచ్చారు.. గతేడాది డిసెంబర్ నెలలో నారా లోకేష్, టీడీపీ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు.. చంద్రబాబును కలిశారు. దీంతో పీకే టీడీపీ కోసం పనిచేస్తున్నారనే చర్చ జరిగింది. ఆయన మాత్రం సీనియ రాజకీయ నేత కావడంతోనే చంద్రబాబుతో భేటీ అయినట్లు ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు
ఇంతలో ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబును కలవడానికి కారణాలు వివరించారు.చంద్రబాబుకు తనకు కామన్ ఫ్రెండ్ ఒకరు కోరడంతోనే తాను విజయవాడ వెళ్లినట్లు చెప్పారు. చంద్రబాబును కలిసే అంశం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని.. తన మిత్రుడు చంద్రబాబును కలవాలని కోరడంతో వెళ్లినట్లు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో తాను ఎవరి కోసం పనిచేయడం లేదని.. అక్కడి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పాలని కోరడంతోనే విజయవాడ వెళ్లినట్టు పీకే అన్నారు. చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత తాను గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చానని.. జగన్మోహన్ రెడ్డి తరపున పనిచేశానని ఈ సారి ఎవరికి పనిచేయడం లేదని చంద్రబాబు నాయుడుకు తేల్చి చెప్పానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాను ఎవరికీ పనిచేయడం లేదని.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు తన పాత్ర, ప్రమేయం ఏమి లేదని కుండబద్దలు కొట్టేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఏ పార్టీకి పనిచేయడం లేదనే క్లారిటీ వచ్చేసింది.