తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఈ నెల 25న శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి నిర్వహించనున్నారు. పురాణాల ప్రకారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్తతీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశగంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమపావనులై ముక్తిమార్గం పొందుతారని నమ్మకం.
శ్రీరామకృష్ణ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్రకారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివసిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు.
ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించడం వల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వల్ల కలిగే దోషాల నుండి విముక్తి లభించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం. ఈ పర్వదినంనాడు ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళతారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు.
శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి కార్యక్రమానికి 10 ఏళ్లలోపు పిల్లలు.. 50 ఏళ్ల పైబడిన వాళ్లు, ఊబకాయం, సర్జరీలు చేయించుకున్నవాళ్లు రావొద్దని టీటీడీ సూచించింది.. వారిని అమనుతించబోమంది. డయాబెటిస్, బీపీ, థైరాయిడ్ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల కోసం గోగర్భం నుంచి పాపవినాశనం వరకు టీటీడీ ఉచితంగా బస్సు ఏర్పాటు చేసింది.
పుష్యమాస పౌర్ణమి గరుడసేవ
పుష్యమాస పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 25న గురువారం రాత్రి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
తిరుమలలో సనాతన ధార్మిక సదస్సుకు వేగంగా ఏర్పాట్లు
తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో జేఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమల ఆస్థాన మండపంలో నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానించేందుకు ఆహ్వాన పత్రికలు, ధార్మిక కార్యక్రమాలపై బుక్ లెట్ రూపొందించాలని డిపిపి అధికారులను ఆదేశించారు.
ఈ సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, వసతి, రవాణా సదుపాయాలను సమన్వయం చేసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ నిర్వహించే ధర్మ ప్రచార కార్యక్రమాలపై వీడియో రూపొందించాలని ఎస్వీబీసి సిఈవోను ఆదేశించారు. సనాతన ధార్మిక సదస్సును ఘనంగా నిర్వహించేందుకు లైజన్, నోడల్ అధికారులను నియమించాలన్నారు. అనంతరం సదస్సు నిర్వహణకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లను విభాగాల వారిగా జేఈవో సమీక్షించారు.