ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. సీఎంను తాను జగన్ రెడ్డి అంటే వైవీ సుబ్బారెడ్డికి నచ్చలేదట.. ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అనే పిలుస్తానన్నారు. తనకు అభ్యంతరం లేదని.. కానీ తనకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపించాలని.. తాను ఆ అభివృద్ధి చూడటానికి సిద్ధమన్నారు.
జగన్ సర్కార్ చేసిన అభివృద్ధిని చూడటానికి తాను సిద్ధమని.. డేట్, టైం వాళ్లు చెప్పినా.. తమను చెప్పమన్నా సరే.. మీడియా వారిని తీసుకుని వస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టిన రాజధాని ఎక్కడ?.. పోలవరం ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. వారు నడిపిన మెట్రో చూడటానికి తాను సిద్ధమన్నారు. ఇదంతా చూసేందుకు మేధావులను కూడా పిలుద్ధామన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించారు.ఈరోజు నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలోని జిల్లాల్లో పీసీసీ చీఫ్ పర్యటించనున్నారు. తొలిరోజు ఇచ్చాపురంలో పర్యటన కోసం ఆర్టీసీ బస్సులో వెళ్లారు. పలాస దగ్గర షర్మిల ఆర్టీసీ బస్ ఎక్కారు.. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో ఏపీసీసీ చీఫ్ ముఖాముఖి నిర్వహించారు. షర్మిలతో పాటు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరా రెడ్డి బస్సులో ప్రయాణించారు. షర్మిల శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.