ఏపీ మంత్రి రోజా, ఆమె సోదరుడిపై సొంత పార్టీ మహిళా నేత భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని అమ్మేసుకున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ ఉండటంతో తనకు పదవి ఇస్తానని హామీ ఇచ్చారని.. తాను ఏకగ్రీవంగా గెలిచిన వెంటనే పదవిపై భరోసా ఇచ్చారన్నారు. మంత్రి రోజా మిగిలిన విషయాలను తన సోదరుడు కుమారస్వామితో మాట్లాడమని చెప్పారని.. ఛైర్మన్ పదవి కోసం ఆయన రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను అడిగినంత డబ్బులు ఇచ్చినా పదవి మాత్రం దక్కలేదన్నారు.
రెండో విడతలో ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పారని.. కానీ ఇంతవరకు తనకు అవకాశం దక్కలేదన్నారు. ఇప్పుడు అడిగితే ఎన్నికల తర్వాత పదవి ఇస్తామని మాయ మాటలు చెబుతున్నారన్నారు. తమకు ఎన్నికల తర్వాత పదవి అవసరం లేదు.. తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని అడిగితే.. మంత్రి రోజా, ఆమె సోదరుడి నుంచి కనీసం స్పందన లేదన్నారు. మంత్రికి మెసేజ్ చేసినా కనీసం స్పందన లేదన్నారు. దళిత మహిళను అయిన తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ను కోరుతున్నాను అన్నారు.
తాము డబ్బులు ఇచ్చినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని.. కొన్ని వీడియోలను ప్రదర్శించారు. రోజా సోదరుడు కుమారస్వామి అనుచరుడు సత్య తన ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు. విడతల వారీగా డబ్బులు ఇచ్చామని.. ఒకసారి రూ.20 లక్షలు.. మరోసారి రూ.7 లక్షలు, ఇంకోసారి రూ.3 లక్షలు, మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు వివరించారు. రోజా సోదరుడు తమకు తిరిగి రూ.29 లక్షలు మాత్రమే ఇస్తామన్నారని.. అవైనా ఇవ్వమంటే అవి కూడా ఇవ్వడం లేదన్నారు. రేపు, మాపు అంటూ తిప్పుకుంటున్నారన్నారు. మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తీసుకునే పరిస్థితి లేదన్నారు.