విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ దాదాపు మూడేళ్ల కిందట విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆ రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఆమోదించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 6, 2021 ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేస్తే.. స్పీకర్ కార్యాలయం నుంచి మంగళవారం ఆమోదం లభించింది. తాజాగా, ఈ అంశంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అభిప్రాయం కోరకుండా కుట్ర కోణంతో రాజీనామాను ఆమోదించారని మండిపడ్డారు.
పవిత్రమైన ఆశయం కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గంటా వ్యాఖ్యానించారు. స్వయంగా స్పీకర్‌ను కలసి రాజీనామా లేఖను సమర్పించానని.. ఆయనతో వ్యక్తిగతంగానూ మాట్లాడానని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా తరువాత అనేక సార్లు స్పీకర్‌ను కలిసినా ఆయన ఆమోదించలేదని, దానిని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచారని దుయ్యబట్టారు. ఇప్పుడు కుట్ర కోణంతో ఆమోదించారని ఆరోపించారు.
కనీసం తనను అడగకుండా రాజీనామాను ఆమోదించారని మండిపడ్డారు. తమ పోరాటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపి ఉంటే స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర పునరాలోలోచన చేసేదేమో అని చెప్పుకొచ్చారు. ఉక్కు పరిశ్రమ ఉద్యమంపై సీఎం జగన్ కన్నెత్తైనా చూడలేదని దుయ్యబట్టారు. పలుసార్లు విశాఖ పర్యటనకు వచ్చినప్పటికీ ఆయన కనీసం దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలపలేదని ధ్వజమెత్తారు. కేంద్రం వద్ద జగన్ మెడలు వంచుతున్నారని... మోదీకి మసాజ్ చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తన రాజీనామాను నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారన్నారు. తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.