మత్స్యకారులకు సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థతో మాట్లాడి తాజాగా రూ.5.38 కోట్లు మంజూరు చేయించినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి మౌలిక వసతులు కల్పిస్తానన్న మాటకు కట్టుబడి ఈ నిధులను మంజూరు చేయించానన్నారు. ఈ నిధులతో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గతంలో ఎన్నడూ చేయనంత అభివృద్ధి చేశామని.. బందరు పోర్టుకు నిధులు తీసుకురావడం వల్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.
మచిలీపట్నం పోర్టు సాకారమైతే మత్స్యకార యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా నిధులలో రూ.3.22 కోట్లతో 2 అతి పెద్దబోట్లు, రూ.14 లక్షలతో చేపలు పట్టే యంత్రాలు, రూ.1.66 కోట్లతో ఫిష్ ఫ్లాట్‌ఫాంలు, రూ.33 లక్షలను వెచ్చించి తాగునీరు అందించే మైక్రో వాటర్ ఫిల్టర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.12 లక్షలతో మత్స్యకార రైతుల కోసం షెడ్లను ఏర్పాటు చేస్తామని.. వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి మత్స్యకారులకు సెక్యూరిటీ లేకుండా రుణాలు మంజూరు చేయించే కార్యక్రమం చేపట్టి.. త్వరలోనే అతి పెద్ద లోన్ మేళాతో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.
మత్స్యకార మహిళలు వ్యాపారం చేసుకునేందుకు, మత్స్యసంపదను భద్రపరిచుందుకు, వలల తయారీ, చేపలు ఎండబెట్టేందుకు, సోలార్ పవర్‌తో డ్రయింగ్‌ప్లాట్‌ఫాంలు, తాగునీటి వసతి నిమిత్తం వాటర్‌ట్యాంకర్‌ల నిర్మాణం, విద్యుదీకరణ పనులకు నిధులు విడుదలైనట్టు ఎంపీ తెలిపారు. చేపలు పాడవకుండా, భారీవర్షాలకు తడి చిపోకుండా ఉండేందుకు షెడ్‌ల నిర్మాణం చేస్తామన్నారు. మత్స్యకార గ్రామాల్లో సురక్షిత తాగునీటి వసతిని ఏర్పాటు చేసేందుకు.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు డబ్బులు విడుదలైనట్టు ఎంపీ తెలిపారు.