నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు గత రాత్రి ప్రభుత్వానికి ఆసుపత్రుల యాజమాన్య సంఘం సమాచారం ఇచ్చింది. గత నెలలో నోటీసులు ఇచ్చి 29 నుంచి సేవలు నిలిపి వేస్తామని సంఘం చెప్పింది. ఎన్నికల తరుణంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుంది. దీంతో వెంటనే ప్రభుత్వం ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలిచింది. ఆస్పత్రులకు వెయ్యి కోట్ల రూపాయల వరకూ బిల్లులు పెండింగులో ఉన్నాయి. పలు శస్త్ర చికిత్సల ఛార్జ్‌లు పెంచాలని ఎప్పటి నుంచో ఆస్పత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ నెల 29 నుంచి సేవలు నిలిపివేస్తామని లేఖ రాశాయి. గతంలో జరిగిన చర్చల్లో బకాయిలు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. 20 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి సానుకూలమైన హామీ ఆస్పత్రులకు లభించలేదు. విసిగిన యాజమాన్యాలు సేవలు నిలిపివేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. దీంతో సేవలు వెంటనే నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే చేర్చుకున్న రోగులకు సేవలు కొనసాగించి, కొత్త రోగులను ఈ రోజు నుంచి చేర్చుకోకూడదని నిర్ణయం తీసుకున్నాయి.