కాంగ్రెస్ పార్టీతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని షర్మిల స్పష్టం అన్నారు. పేదలకు అండగా వుండే ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం వుందని, ఇందుకోసం ప్రతిఒక్కరూ కష్టపడాలన్నారు. ఇంటింటికీ వెళ్లి గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలతోపాటు పార్టీ విధివిధానాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి, రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను తెలియజేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తెలంగాణలో 20 శాతం ఉన్న ఓటు బ్యాంకు...ఎన్నికల నాటికి 40 శాతానికిపైగా చేరుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని, కార్యకర్తలు బలంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరించడంతోపాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను అమలు చేస్తామన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను మ్యానిఫెస్టోలో చేర్చుతామని షర్మిల స్పష్టంచేశారు. విభజన హామీల అమలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతోందని ఆరోపించారు. బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుందన్నారు. వైసీపీ పాలనా వైఫల్యాలను ప్రజలు దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడడం ఖాయమన్నారు.