రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మండపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సంప్రదింపులు చేయకుండానే ఏకపక్షంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ అభ్యంతరం తెలిపారు. ఇది పొత్తు ధర్మం కాదని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించి జనసేన చీఫ్ కీలక ప్రకటన చేశారు. తొలిసారి అభ్యర్థులను పవన్ ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కూడా తన పార్టీ అభ్యర్థులను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నట్లు పవన్ అన్నారు. పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నామని.. కొన్నిసార్లు ఆటుపోట్లు ఎదురైనా తప్పవన్నారు. పొత్తులో భాగంగా అన్ని ఎన్నికల్లోనూ మూడో వంతు సీట్లను తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికలతోనే తాను ఆగిపోవడం లేదని.. భవిషత్‌లో కూడా పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.