ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి.. మరోసారి తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ పాలనకు.. జగనన్న పాలనకు చాలా వ్యత్యాసం ఉందని, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. దివంగత నేత వైఎస్సార్ జలయజ్ఞంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాజెక్టులు జలమయం చేసి, పోలవరం పనులు 32 శాతం పూర్తి చేశారన్నారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ పక్కన పడేశారని, తర్వాత చంద్రబాబు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ప్రాజెక్ట్ ముందుకు కదలలేదని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి షర్మిలా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదాపై బాబు, జగన్ మాట్లాడింది లేదని దుయ్యబట్టారు. బీజేపీతో దోస్తీ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా గురించి రాగం తీసి, నిరాహార దీక్షలు చేసిన వాళ్లు ఇప్పుడు బీజేపీకి బానిసలుగా మారారని ధ్వజమెత్తారు. హోదా కాదు కదా? కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదని, ఏపీలో ఉన్న అందరూ బీజేపీకి బానిసలే అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని.. అలాంటి మోసం చేసిన పార్టీతో టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన పార్టీలు దోస్తీ కట్టాయని విమర్శించారు. ముఖ్యంగా బీజేపీకి మూడు పార్టీలు బానిసలుగా మారాయని మండిపడ్డారు. బీజేపీకి షర్మిల కొత్త ఆర్ధం చెప్పారు. B - అంటే బాబు.. J అంటే జగన్.. P అంటే పవన్.. ముగ్గురు బీజేపీకి బానిసలని, కేంద్రం బిల్లు పెడితే ఒక్క మాట మాట్లాడకుండా ఓటు వేస్తారని ఆరోపించారు.
వైఎస్సార్ హయాంలో ముస్లీం లకు 4 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వాలని భావించారని, ఆయన ఉండుంటే 7 శాతానికి పెరిగేవన్నారు. కేంద్రంలో బీజేపీ మతతత్వ పార్టీ. మణిపూర్ లో 2 వేల చర్చ్ లను ధ్వంసం చేసిందని ధ్వజమెత్తారు. చర్చిలపై దాడులు చేస్తుంటే క్రిస్టియన్ అయిన జగన్ ఆన్న బీజేపీపై ఒక్క మాట మాట్లాడలేదని షర్మిల తూర్పారబట్టారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరూ సైనికుడిలా మారాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుందని, పోలవరం పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని, గుంతలూరు గుంటూరు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.