ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 9న శ్రీపురందరదాసుల ఆరాధనోత్సవం, 10న తిరుకచ్చినంబి ఉత్సవం, 14న వసంత పంచమి, 16న రథసప్తమి, 19న తిరుకచ్చినంబి శాత్తుమొర, 20న భీష్మ ఏకాదశి, 21న కులశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 24న కుమారధార తీర్థ ముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ వేడుకలను నిర్వహించనున్నామని, భక్తులు విశేష ఉత్సవాల్లో పాల్గొనాలని పేర్కొంది.
రథసప్తమిగా పిలిచే సూర్య జయంతిని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. తిరుమలలో జరిగే రథసప్తమి వేడుకలను మినీ బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథ సప్తమి పర్వదినం నేపథ్యంలో ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేస్తుంది.
సూర్యోదయం వేళ సూర్యప్రభ వాహనం, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం.. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం.. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహిస్తారు.