తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్.. మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టారు. వరుసగా తొమ్మిదోసారి ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ- జేడీయూ కూటమి కూడా ఎక్కువ కాలం నిలవబోదని ఆయన జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత ఈ కూటమిలో చిచ్చురేగడం ఖాయమని పీకే విమర్శించారు.
వచ్చే ఏడాది జరిగే బిహార్ శాసనసభ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని ప్రశాంత్ కిశోర్ వివరించారు. అంతకుముందే ఆ పొత్తుకు తెరపడుతందని ఎద్దేవా చేశారు. నీతీశ్కు తలుపులు మూసుకున్నాయని గతేడాది చెప్పిన బీజేపీ, పొత్తు పెట్టుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని విమర్శించారు. ‘గత ఏడాదిగా నేను చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తిరిగి గమనిస్తే తెలుస్తోంది.. నీతీశ్ కుమార్ ఎప్పుడైనా కూటమి మారవచ్చని చెప్పిన ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. నీతీశ్ ఒక 'పాల్తురామ్' అని ప్రజలకు ఇప్పటికే తెలుసు’ అని దుయ్యబట్టారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ హయాంలో కాంగ్రెస్ చేసిన పనినే ఇప్పుడు బీజేపీ చేస్తోందని పీకే విమర్శించారు. రెండు జాతీయ పార్టీలు స్వల్పపాటి లాభాల కోసం పెద్దగా ప్రజాదరణ లేని ప్రాంతీయ నేతలతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. ఈ "రివాల్వింగ్ డోర్ రాజకీయాలకు" ముగింపు పలకడానికి 'జన్ సురాజ్' ప్రచారం కట్టుబడి ఉందని కిశోర్ పేర్కొన్నారు.
‘నితీశ్ కుమార్ ఎప్పుడైనా మారవచ్చు అని నేను మొదటి నుంచి చెబుతున్నాను.. ఇది ఆయన రాజకీయాల్లో భాగమైపోయింది.. కానీ బీహార్‌లో అన్ని పార్టీలు, నాయకులు ‘పల్తుమన్లు’ అని నేటి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. (ప్రధాని) నరేంద్ర మోదీ, (హోంమంత్రి) అమిత్ షా, బీజేపీ కూడా ‘పల్తుమార్’ అని ఇప్పుడు రుజువైంది’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిశోర్ 2018లో జేడీయూలో చేరి, పార్టీ ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే, పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా జేడీయూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడంతో బహిష్కరణకు గురయ్యారు. తర్వాత జన సూరజ్ పేరుతో తన సొంత రాష్ట్రం బిహార్‌లో పాదయాత్రను చేపట్టిన పీకే.. ఎన్నికల వ్యూహ సంస్థ ఐ ప్యాక్ నుంచి కూడా బయటకొచ్చిన విషయం తెలిసిందే.