వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆయన తనయుడు నారాయణవనం జెడ్పీటీసీ సభ్యులు కోనేటి సుమన్‌కుమార్ హైదరాబాద్‌లో లోకేష్‌తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. వచ్చే ఎన్నికల్లో సత్యవేడులో టీడీపీ విజయానికి కృషి చేస్తామని వారు తెలిపారు. వైఎస్సార్‌సీపీలో పరిణామాలు, మానసిక వేదనను భరించలేక టీడీపీలోకి వస్తున్నట్లు చెప్పారు. పార్టీ నుంచీ ఏమీ ఆశించకుండా బేషరతుగా టీడీపీకి మద్దతు తెలిపినట్టు సమాచారం. రెండ్రోజుల్లో చంద్రబాబునాయుడిని కలిసిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీని సొంత పార్టీలా భావిస్తున్నారన్నారు ఆదిమూలం. తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండకూడదనే కుట్ర పన్నారని.. ఆయన్ని విమర్శించినందుకు పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలంటున్నారన్నారు. తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పడం కూడా నేరమా?.. ఎక్కడైనా సరే ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండలేమన్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం సేవలందించిన తనపై కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉంటాను తప్ప ఎంపీగా ఉండనని సీఎంతోనే చెప్పానన్నారు ఆదిమూలం. ఈ విషయం మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి సహా అందరికీ తెలుసని.. రెండు నెలలు మానసికంగా ఇబ్బందిపడుతున్నాను అన్నారు. చివరికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లానని.. అవమానం భరించలేకపోతున్నాం.. ఎమ్మెల్యే టికెటు ఇప్పించాలని కోరానన్నారు. తన చేతుల్లో ఏముంది, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి సమాధానమిచ్చారని చెప్పుకొచ్చారు. ఆ రోజే నియోజకవర్గం నుంచి 70 మంది వరకు మంత్రి దగ్గరికి వెళ్లి తనకు టికెట్ కేటాయించాలని అడిగారని.. జగన్ సర్వేలు చూస్తున్నారని వారితో చెప్పి పంపించారన్నారు.
తనకు ఎమ్మెల్యే టికెట్ లేకుండా చేశారు.. ఇటు ఎంపీగా కూడా ఉండకూడదని కుట్ర పన్నారన్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎంపీ గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గంలో రెండ్రోజులు పర్యటించారని.. అయినా బాధపడలేదన్నారు. కానీ ఈ నెల 27న తిరుపతిలో తన నియోజకవర్గ ఆత్మీయ సదస్సు ఎందుకు పెట్టారనే అంశంపైనే మాట్లాడానన్నారు. టికెట్ విషయంలో సంబంధం లేదని చెప్పిన పెద్దిరెడ్డి ఇలా ఆత్మీయ సదస్సు నిర్వహించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఇలా చేయడం లేదు కదా? అన్నారు. తనను తిట్టాలని పార్టీలో కొందరు నేతల్ని ఆదేశించారన్నారు.
సత్యవేడు నియోజకవర్గం నుంచి ఆదిమూలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.. అయితే ఆయనకు అసెంబ్లీ టికెట్‌ను నిరాకరిస్తూ తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు బాధ్యతల్ని అప్పగించారు. ఆదిమూలంను తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. అయితే ఆదిమూలం మాత్రం తాను సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పారు.. అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.