వియత్నాంలో ఓ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఒక మహిళ ఏకంగా లక్ష కోట్లకుపైగా భారీ అవినీతికి పాల్పడింది. ఇప్పుడు ఈ భారీ కుంభకోణం.. ఆ దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. వియత్నాం చరిత్రలోనే అత్యంత భారీ కుంభకోణంగా భావిస్తున్న ఈ వ్యవహారంలో మోసపోయిన వేలాది మంది.. లబోదిబోమని రోదిస్తున్నారు. మొత్తం 4 ఏళ్లలో ఆమె ఈ భారీ కుంభకోణాన్ని చేసినట్లు అధికారులు గుర్తించారు.
వియత్నాంలో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా పేరు గాంచిన ఓ మహిళ ఈ భారీ అవినీతికి పాల్పడటం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. ఏకంగా 12.5 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.లక్ష కోట్లకు పైనే ప్రజల సొమ్మును ఆ మహిళ కాజేసింది. దీంతో ఆ మహిళ కారణంగా దాదాపు 42 వేల మంది బాధితులు ప్రభావితం అయ్యారు. వియత్నాంలోని ఫేమస్ ప్రాపర్టీ డెవలపర్ వాన్ తిన్హ్ పాట్ అనే కంపెనీ ఛైర్‌పర్సన్ ట్రుయాంగ్ మైలాన్ ఈ మోసానికి తెరలేపారు. స్థానికంగా ఉన్న సైగాన్ కమర్షియల్ బ్యాంకులో ట్రుయాంగ్ మైలాన్‌కు దాదాపు 90 శాతం వాటా ఉంది. అయితే ఆమె గత కొన్నేళ్ల నుంచి ఆ సైగాన్ కమర్షియల్ బ్యాంకులో అనేక మోసాలకు పాల్పడ్డారు. నకిలీ లోన్ అప్లికేషన్లు పెట్టి కోట్ల రూపాయల డబ్బులను ఆమె తీసుకున్నారు.
అయితే తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఆ సైగాన్ కమర్షియల్ బ్యాంకు కార్యకలాపాలు ప్రస్తుతం నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ఆ బ్యాంకును నమ్మి వియత్నాంలోని దాదాపు 42 వేల మంది.. అందులో డబ్బులు దాచుకోగా.. వాటన్నింటినీ ట్రుయాంగ్ మైలాన్ కొట్టేయడం సంచలనంగా మారింది. 2018 నుంచి 2022 మధ్య ట్రుయాంగ్ మైలాన్.. ఇలా 916 ఫేక్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని.. దాని ద్వారా బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ (వియత్నాం కరెన్సీ)లు అంటే భారత కరెన్సీలో రూ.1.03 లక్షల కోట్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.
2019 నుంచి 2022 మధ్య ట్రుయాంగ్ మైలాన్ డ్రైవర్ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్లు అంటే రూ.36.5 కోట్ల నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 2022 లో ఈ భారీ కుంభకోణం బయటపడింది. దీంతో అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ట్రుయాంగ్ మైలాన్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసి.. తిరిగి విత్ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు సంగతి అటుంచితే కనీసం దాచుకున్న డబ్బుపై వడ్డీ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
దీంతో ఈ కుంభకోణానికి వ్యతిరేకంగా వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ కుంభకోణం కేసులో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ కుంభకోణంలో ట్రుయాంగ్ మైలాన్‌తో పాటు మరో 85 మందిపై కూడా అధికారులు కేసులు నమోదు చేశా. ఇందులో సైగాన్ కమర్షియల్ బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారని అధికార వర్గాలు తెలిపారు. హాంకాంగ్‌కు చెందిన ఓ బడా బిజినెస్‌మెన్‌ను ట్రుయాంగ్ మైలాన్ పెళ్లి చేసుకున్నారు. ట్రుయాంగ్ మైలాన్‌కు చెందిన వాన్ తిన్హ్ కంపెనీకి వియత్నాం వ్యాప్తంగా లగ్జరీ హోటళ్లు, అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ వాన్ తిన్హ్ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. అయితే ఆమె సంపద విలువ 2022 నాటికి వియత్నాం దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.