సాధారణంగా మనం వాడే నిమ్మకాయ ధర ఎంత ఉంటుంది. మహా అయితే ఓ రూ.5 ఉంటుంది. మరీ డిమాండ్ ఎక్కువ ఉంటే రూ.10 కు విక్రయిస్తారు. కానీ ఈ నిమ్మకాయ ధర వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఆ నిమ్మకాయ రూ.1.5 లక్షలు పలికింది. ఈ వార్త విన్నవారు అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఆ నిమ్మకాయ వేలంలో రూ.1.5 లక్షలు పలకడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. ఎందుకంటే అది ఒక పురాతనమైన నిమ్మకాయ. పురాతనమైంది అంటే వందల ఏళ్ల క్రితం నాటిది.
ఇంగ్లాండ్‌లోని ఒక కుటుంబానికి ఒక విచిత్రమైన వస్తువు కంటపడింది. అది కొన్ని శతాబ్దాల కిందట అప్పటి మంత్రి వర్గంలో ఉన్న వారిది అని ఆ కుటుంబం వెల్లడించింది. అయితే 18 వ శతాబ్దంలోని నిమ్మకాయగా పేర్కొన్నారు. 2 అంగుళాల వెడల్పుతో గోధుమ రంగులో ఉన్న ఆ ఎండిన నిమ్మకాయపై చెక్కిన వివరాల ప్రకారం అది 1739 సంవత్సరం నాటిదని తెలుస్తోంది. ఆ నిమ్మకాయను నవంబర్ 3 1739 న మిస్టర్ పి లూ ఫ్రాంచినీ.. మిస్ ఇ బాక్స్ టర్‌కి అందించినట్లు దానిపై రాసి ఉంది.
అయితే ఆ నిమ్మకాయను ఆ కుటుంబం సరదాకి వేలంలో ఉంచింది. ఆ విచిత్రమైన నిమ్మకాయకు రూ.5 వేలు లేదా రూ.6 వేలు పలుకుతుందని అంతా భావించారు. కానీ అక్కడ ఉన్నవారందరినీ షాక్‌కు గురి చేస్తూ ఆ నిమ్మకాయ 1,416 పౌండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.50 లక్షలు పలికింది. బ్రెట్టెల్స్ వేలం పాట యజమాని డేవిడ్ బ్రెట్టెల్ ఈ నిమ్మకాయను సరదా కోసం విక్రయించాలని భావిస్తే రూ. 1.50 లక్షలు పలకడంతో వారంతా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వార్తల్లోకి ఎక్కింది.