ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంజీ రామచంద్రన్ నుంచి విజయ్ దాకా.. తమిళ రాజకీయాల్లోకి సినిమా సెలబ్రిటీలు

national |  Suryaa Desk  | Published : Sat, Feb 03, 2024, 10:23 PM

తమిళ రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. సినిమాల నుంచి రాజకీయాలకు వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. అయితే మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పటికీ.. తమిళనాడులో ఉన్నంత మాత్రం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తమిళగ వెట్రి కళగం-టీవీకే పేరుతో పార్టీని పెడుతున్నట్లు శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంజీ రామచంద్రన్ నుంచి తమిళ రాజకీయాల్లో ప్రారంభమైన సినీ సెలబ్రిటీల అరంగేట్రం.. ప్రస్తుతం విజయ్ వరకు వచ్చింది. అయితే ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేసేది లేదని ప్రకటించిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ అని స్పష్టం చేశారు.


తమిళగ వెట్రి కళగం పార్టీతో విజయ్ ఎంట్రీ


తమిళనాడులో కొత్త పార్టీని పెడుతున్నట్లు హీరో విజయ్ దళపతి స్పష్టం చేశారు. తమిళగ వెట్రి కళగమ్ -టీవీపీ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమిళగ వేట్రి కజగమ్ అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం. ఈ క్రమంలోనే తమిళగ వేట్రి కజగమ్ పార్టీ నేతలు.. విజయ్‌ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. ఇక ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఏ పార్టీకీ మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. అయితే హీరో విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతుండగా.. తాజాగా అది నెరవేరింది. ఇక ఇప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తానని.. అప్పుడే పార్టీ కార్యక్రమాల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంటుందనిత తెలిపారు.


ఎంజీ రామచంద్రన్‌తో ప్రారంభం


తమిళనాడు రాజకీయాల్లో, సినిమాల్లో ఎంజీ రామచంద్రన్ ఒక వెలుగు వెలిగారు. అయితే తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడిగా మారుత్తూర్ గోపాలన్ రామచంద్రన్ (ఎంజీఆర్) నిలిచారు. ఓ వైపు సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఎంజీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కళగం- ఏఐఏడీఎంకే అనే పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే పార్టీ పెట్టిన 5 సంవత్సరాల్లోనే ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. దీంతో 1977 లో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 నుంచి 1980, 1980 నుంచి 1985.. 1985 నుంచి 1987 వరకు మొత్తం 3 సార్లు తమిళనాడు సీఎంగా ఎన్నికయ్యారు.


ఎంజీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి జయలలిత 


పురుచ్చి తలైవిగా పేరు గాంచిన జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. 140 కి పైగా చిత్రాల్లో నటించిన జయలలిత.. 1982 లో ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ఎంజీఆర్ మరణం తర్వాత జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కొని చివరికి అన్నాడీఎంకే పార్టీని నడిపించారు. 1991 నుంచి 2016 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత 6 సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 1991లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జయలలిత.. 1991 నుంచి 1996.. 2001 లో 130 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2006.. 2011 నుంచి 2014 వరకు.. 2015 నుంచి 2016 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.


కెప్టెన్ విజయ్‌కాంత్


మరో తమిళ సినిమా హీరో కెప్టెన్ విజయ్‌కాంత్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 2005 లో దేశీయ ముర్పొక్కు ద్రవిడ కళగమ్ - డీఎండీకే పేరుతో కొత్త పార్టీని పెట్టారు. అయితే డీఎండీకే ఇప్పటివరకు ఒక్కసారి కూడా తమిళ రాజకీయాల్లో అధికారంలోకి రాలేకపోయింది. అయినప్పటికీ 2011 నుంచి 2016 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విజయ్‌కాంత్ పని చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇటీవలె 2023 డిసెంబర్‌లో విజయ్‌కాంత్ మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి డీఎండీకే పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలత చూసుకుంటున్నారు.


విశ్వనటుడు కమల్ హాసన్


భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విశ్వనటుడిగా పేరు గాంచిన కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీని స్థాపించారు. 2018 ఫిబ్రవరి 21 వ తేదీన మక్కల్ నీధి మయ్యం (ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్ హాసన్.. తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరీ రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రస్తుతం క్రియాశీలకంగానే పనిచేస్తోంది.


శరత్ కుమార్


మరో తమిళ నటుడు ఆర్ శరత్ కుమార్ కూడా తమిళనాడులో పార్టీని పెట్టారు. 2007 లో ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చి’ (ఏఐఎస్ఎంకే) అనే పార్టీని స్థాపించారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శరత్ కుమార్ పార్టీ.. రెండు స్థానాల్లో విజయం సాధించింది. రాజకీయవేత్త కె. కామరాజ్ విలువలను పాటిస్తామని శరత్ కుమార్ ప్రకటించారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు శాసనసభలో అడుగుపెట్టారు.


శివాజీ గణేశన్


తమిళ హీరో శివాజీ గణేశన్ కూడా తమిళ రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 1988 లో తమిళగ మున్నెట్ర మున్నని(టీఎంఎం) అనే పార్టీని స్థాపించాడు. అయితే కొన్ని కారణాలతో పార్టీని స్థాపించిన మరుసటి సంవత్సరమే అంటే 1989 లోనే తమిళగ మున్నెట్ర మున్నని పార్టీని జనతా దళ్ పార్టీలో శివాజీ గణేశన్ విలీనం చేశారు.


సూపర్ స్టార్ రజినీకాంత్


సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా తమిళ రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే అది మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు వెళ్లలేదు. పార్టీ పెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తలైవా.. తన అభిమానులతో విస్తృత సమావేశాలు కూడా నిర్వహించారు. పార్టీ పేరు కూడా బయటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయాన్ని ఆయన విరమించుకున్నారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆరోగ్యం సహకరించని కారణంగానే రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన సన్నిహత వర్గాలు వెల్లడించాయి.


ఉదయనిధి స్టాలిన్ 


ఇక దివంగత కరుణానిధి మనవడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గత 2021 ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి డీఎంకే పార్టీ భారీ విజయం సాధించడంలో ఉదయనిధి స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలిచి తమిళనాడు శాసనసనలో అడుగుపెట్టారు. అయితే మంత్రిగా పనిచేస్తూనే సినిమాల్లో కూడా ఉదయనిధి స్టాలిన్ నటించడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com