అమరావతి రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అమరావతిలోని భూసేకరణ ప్రాంతంలో సమస్యాత్మక ప్లాట్లు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించేందుకు సీఆర్‌డీఏ చేపట్టిన ఈ లాటరీ చేపడుతోంది. ఈ నెల 5 నుంచి 8వ తేదీవరకు మరోసారి ఈ లాటరీ నిర్వహించనున్నట్లు సీఆర్‌డీఏ కమిషనర్ ప్రకటించారు. సందేహాల నివృత్తి కోసం విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో సంబంధిత గ్రామాల సిబ్బంది ఆదివారం కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
అమరావతి ప్రాంతంలో గ్రామాల వారీగా నివాస, వాణిజ్య స్థలాలు కేటాయించేందుకు ప్రకటనలు ఇస్తోన్న సీఆర్డీఏ వైఖరికి నిరసనగా రైతులు గైర్హాజరవుతున్నారు. దీంతో మరో అవకాశం కల్పిస్తున్నట్టు సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి 5న, కురగల్లు, నెక్కల్లు, నిడమర్రు, గ్రామాలకు ఫిబ్రవరి 6న, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, మందడం, కొండమరాజపాలెం గ్రామాలకు ఫిబ్రవరి 7న, నవులూరు, లింగాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల రైతులకు ఫిబ్రవరి 8న ఈ-లాటరీ ప్రక్రియ నిర్వహిస్తామని సీఆర్డీఏ తెలియజేసింది. మరోవైపు రైతులు ఆందోళన చెందుతున్నట్టుగా మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదని.. 16 గ్రామాల రైతులకు లేఆవుట్ ప్లాన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి శనివారం ఈ లాటరీ నిర్వహించాల్సి ఉంది. వెంకటపాలెం, రాయపూడి పరిధిలోని గ్రామాలకు నిర్వహించిన ఈ లాటరీ సైతం కోరం లేక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు ఈ లాటరీకి ఏర్పాట్లుచేసినా రైతుల నుంచి వ్యతిరేకతే ఎదురైందని చెబుతున్నారు. ఈ ప్లాట్ల విషయంలో రాజధాని రైతులు వరుసగా విముఖత చూపుతూనే ఉన్నారట. అందుకే ఈ నెల 5 నుంచి 8 వరకు ఈ లాటరీ నిర్వహించనున్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని సీఆర్డీఏ అధికారులు సూచిస్తున్నారు.