ప్రకాశం జిల్లా దోర్నాలలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం సమీపంలో శ్రీశైలం రోడ్డులో మూడంతస్థుల భవనం పేకమేడలా కుప్పకూలింది.ఈ ఘటనతో దాదాపు రూ.కోటి వరకూ నష్టం వాటిల్లినట్లు భవన యజమాని పరుచూరి సుబ్బారావు తెలిపారు. సుమారు 20ఏళ్ల క్రితం సుబ్బారావు మూడంతస్థుల భవనం నిర్మించి లాడ్జి నిర్వహణకు అద్దెకు ఇచ్చారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆయన సోదరుడు పరుచూరి రామారావు నూతన భవన నిర్మాణం కోసం 20 రోజుల క్రితం పది అడుగుల లోతున పునాదులు తీయించారు. ప్రస్తుతం కుప్పకూలిన భవనానికి 5 అడుగుల వరకు మాత్రమే పునాదుల ఉన్నాయి. పైగా నూతన భవనం కోసం తీసిన పునాదుల్లోకి లాడ్జి నుంచి వ్యర్థపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో మట్టిలో పటుత్వం తగ్గి పాత భవనం ఓ వైపునకు ఒరిగింది. ఆందోళన చెందిన లాడ్జి నిర్వాహకుడు నాలుగు రోజుల క్రితమే నిర్వహణ నిలిపి వేశారు. ప్రస్తుతం అందులో ఎవరూ ఉండటం లేదు. ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా ఈ భవనం కుప్పకూలింది.