అబద్ధాలతో ప్రజలను వంచిస్తున్న సీఎం జగన్‌కు ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన విఫల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆదివారమిక్కడ ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ శాసనసభాపక్ష (టీడీఎల్పీ) సమావేశం జరిగింది. ప్రజాకోర్టు-జగన్ నెరవేర్చని హామీలపై టీడీఎల్పీ రూపొందించిన చార్జిషీటును విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఊరూరా తిరిగి అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను నిట్టనిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. మేనిఫెస్టో, పాదయాత్రలో మొత్తం 730 హామీలివ్వగా.. వాటిలో 21 శాతం కూడా అమలు చేయలేదని.. కానీ 99 శాతం అమలు చేశామని చెబుతూ ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. మోసపూరిత మాటలతో ప్రజలను మోసగిస్తున్న జగన్‌కు మరో రెండు నెలల్లో ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.