సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం మధ్యాహ్నం, రాత్రి పొద్దుపోయాక రెండు దఫాలుగా సమావేశమయ్యారు. ఉభయ పార్టీల నేతలెవరూ లేకుండా ఏకాంతంగా, సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. పొత్తు సీట్లను త్వరత్వరగా తేల్చడమే ఈ భేటీల ఉద్దేశం. మధ్యాహ్నం తొలుత ఇక్కడి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు. వెంట ఎవరూ లేకుండా మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయం నుంచి తన కారు తానే డ్రైవ్ చేసుకుంటూ పవన్ వచ్చారు. ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతం పలికారు. తర్వాత చంద్రబాబు ఆయన్ను ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సుమారు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి. రాత్రి 9.30 గంటలకు మరోసారి పవన్ ఉండవల్లికి వచ్చి చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని తీసుకుని.. అక్కడ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది.. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయి.. తమ తమ సర్వేల నివేదికల ఆధారంగా చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జనసేనాని 32 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 20 స్థానాలిచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని.. వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి. టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని, 27 ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి. అలాగే కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు. తాజాగా అనకాపల్లి గానీ, తిరుపతి గానీ ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసింది. రెండు పార్టీల శిబిరాల నుంచి ‘ఆంధ్రజ్యోతి’ సేకరించిన సమాచారం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో సీట్ల సర్దుబాటే ఈ పార్టీలకు కష్టతరంగా ఉన్నట్లు సమాచారం. జనసేనకు ఎక్కువ మంది నాయకులు అక్కడే ఉన్నారు. అక్కడే ఆ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతోంది. టీడీపీకి కూడా బలమైన నాయకత్వం ఆ జిల్లాల్లోనే ఉంది. దీంతో రెండు పార్టీల్లో ఎక్కడ ఎవరికి మంచి అభ్యర్థి ఉన్నారు.. ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో బేరీజు వేసుకుని.. తదనుగుణంగా ముందుకెళ్లాలని అధినేతలిద్దరూ నిర్ణయించారు. అదే సమయంలో సామాజిక సమీకరణలు, వైసీపీ అభ్యర్థులు, సర్వేల్లో వస్తున్న ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో జనసేన అడిగిన స్థానాల్లో విజయనగరంలో 1, విశాఖ-6, తూర్పుగోదావరి-6, పశ్చిమ గోదావరి-4, కృష్ణా-3, గుంటూరు-2, ప్రకాశం-2, నెల్లూరు-2, కడప-1, చిత్తూరు-2, కర్నూలు-1, అనంతపురంలో 2 ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్, యలమంచిలి, భీమవరం, నరసాపురం, పోలవరం, విజయవాడ (పశ్చిమ), తెనాలి, దర్శి సహా 20 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు.