నేను సచ్ఛీలుడినని సీబీఐ తేల్చింది..మీ సచ్ఛీలతను నిరూపించుకోండి చంద్ర బాబూ..! అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నా మీద పెట్టిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆనాడు పత్రాలు మాయం అయిన కేసులో ఎస్పీ విజయారావు విచారణ చేసి దోషులను గుర్తించారు. ఆ తర్వాత నా మీద దాడి ప్రారంభం అయ్యింది..సాక్షాలు తారుమారు చేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మాట్లాడారు. ఒకడుగు మందుకు వేసి దీన్ని గోవర్ధన్‌రెడ్డే చేశాడని ఆరోపిస్తూ సోమిరెడ్డి దానిపై ఎంత శిక్ష పడుతుందో కూడా చెప్పేశాడు. జడ్జిగారి కంటే ముందు ట్రైల్ స్పీడ్‌గా పూర్తి చేశాడు. ఆనాడే మాకు సంబంధం లేదని స్పష్టం చేశాం. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అందరితో పాటు నాకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐకి అప్పగించడానికి మీకేమైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు. చాలా మంది నేను ప్రతిఘటిస్తానని అనుకున్నారు. కానీ నోటీసు ఇచ్చిన రోజే వెంటనే మా న్యాయవాది మేం సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ గారు కూడా విచారణకు అభ్యంతరం లేదని చెప్పారు. విచారణను ఈ దొంగతనం ఒక్కటే చేయాలా..మొత్తం కేసు మీద చేయాలా అని కూడా అడిగారు. మొత్తం కేసు మీద విచారణ చేస్తామన్నా అభ్యంతరం లేదని తేలియజేశాం. కోర్టులో ఫైళ్లు మాయమయిన వరకే కేసును పరిమితం చేస్తూ హైకోర్టు సీబీఐకి అప్పగించారు. వాళ్లు నన్ను ఒక్క సారి విచారణ చేశారు..కానీ దోషి కంటే ఎక్కువగా సోమిరెడ్డి వారి చుట్టూ తిరిగాడు. బయటకు రావడం..ఇక గోవర్ధన్ రెడ్డి తప్పించుకోలేడు అంటూ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఏడాది కాలం పాటు విచారణ సాగింది. అన్ని విషయాలు సేకరించారు..అందర్నీ విచారించారు. వాళ్లు చేసిన విచారణ చూస్తే అన్ని కోణాల్లో విచారణ జరిపారు. మీడియాలో వచ్చిన వార్తల్లో వచ్చిన ఆరోపణలపై కూడా వారు విచారణ జరిపారు. 88 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. అనాడు ఎస్పీ విజయారావు గారు గుర్తించిన నిందితులు ఇద్దరినే సీబీఐ కూడా దోషులుగా నిర్ధారించారు. పోలీసుల విచారణలో కూడా ఎక్కడా లోపాలు జరగలేదని కూడా వారు స్పష్టంగా చెప్పారు. నా పాత్ర లేదని నేను చెప్పుకునే కన్నా దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ చెప్పింది. చంద్రమోహన్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు..వాటిని కూడా విచారణ చేశాం..నిందితులకు, గోవర్ధన్‌రెడ్డి అసలు సంబంధాలు లేవని చెప్పారు అని తెలిపారు.